యాదాద్రి ప్రధానాలయంలో ఇంకా మొదలవ్వని పూజలు

యాదాద్రి ప్రధానాలయంలో ఇంకా మొదలవ్వని పూజలు
  •     అందుబాటులోకి కల్యాణకట్ట, పుష్కరిణి
  •     ప్రధానాలయంలో ఇంకా మొదలవ్వని పలు పూజలు

యాదగిరిగుట్ట, వెలుగు :  ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ ద్వారా యాదాద్రీశుడి ప్రధానాలయాన్ని పునఃప్రారంభించిన నేపథ్యంలో ఆలయ ఆఫీసర్లు భక్తులు స్వామివారికి నిర్వహించే సేవలను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తెస్తున్నారు. భక్తుల‌ సౌకర్యార్థం బుధవారం 'వేదాశీర్వచనం' పూజను ఏఈఓ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు ప్రారంభించారు. రూ.600 తో వేదాశీర్వచనం టికెట్ కొన్న భక్తులకు గర్భాలయంలో స్వామివారి దర్శనం తర్వాత అద్దాలమేడ వద్ద వేదపండితులు వేదాశీర్వచనం ఇస్తారు. పశ్చిమ, ఉత్తర రాజగోపురాల మధ్యలో ఏర్పాటు చేసిన అద్దాలమేడ ఎదుట భక్తులకు వేదాశీర్వచనం చేసి, స్వామివారి లడ్డూప్రసాద అందజేశారు.

ఆ పూజలు ఇంకా మొదలుకాలే  

నరసింహుడి స్వయంభూ దర్శనాలు షురూ అయినా సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, కల్యాణాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఆలయ ఉద్ఘాటన సందర్భంగా ఆలయ గోపురాలపై అమర్చిన కలశాలకు పూజలు చేయడానికి స్కాఫోల్డింగ్(పరంజా) ఏర్పాటు చేశారు. అయితే స్కాఫోల్డింగ్ తొలగించడానికే దాదాపుగా 10 రోజుల టైం పడుతుందని, అప్పటివరకు నిత్య పూజలు నిర్వహించడం వీలుకాదని ఆలయ ఆఫీసర్లు చెప్తున్నారు. ఏప్రిల్ 16 నుంచి మొక్కు పూజలు మొదలయ్యే అవకాశముందని ఆలయ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే పాతగుట్టలో మొక్కు పూజలు నిర్వహిస్తున్నారు.

అందుబాటులోకి పుష్కరిణి, కల్యాణకట్ట

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండ కింద గండి చెరువు దగ్గర భక్తుల కోసం ఏర్పాటు చేసిన లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 28నే ప్రారంభించినా, భక్తులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి బుధవారం నుంచి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు తలనీలాలు సమర్పించుకోవడానికి రూ.20 కోట్లతో కల్యాణకట్ట నిర్మించగా, స్నానాలు చేయడానికి రూ.11 కోట్లతో లక్ష్మీపుష్కరిణిని ఏర్పాటు చేశారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 2 వేల మంది ఒకేసారి స్నానం చేసేలా 15 లక్షల‌ లీటర్ల కెపాసిటీతో పుష్కరిణి నిర్మించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా మొత్తం 51 గదులు, డ్రెస్ చేంజ్ రూమ్స్, టాయిలెట్స్, వాష్ రూమ్స్ వంటి సదుపాయాలు కల్పించారు.