పుష్పక్ విమాన్ సక్సెస్

పుష్పక్ విమాన్ సక్సెస్
  • సొంతంగా ల్యాండయిన ఇస్రో రాకెట్
  • కర్నాటకలో విజయవంతంగా ప్రయోగం
  • 4.5 కి.మీ. ఎత్తులో రాకెట్​ను జారవిడిచిన చినూక్ 

ఇస్రో చేపట్టిన పుష్పక్ రాకెట్ ల్యాండింగ్​ ప్రయోగం విజయవంతమైంది. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్​తో ఈ రీయూజబుల్ లాంచింగ్​ వెహికల్​ను నింగిలోకి తీసుకెళ్లి జారవిడవగా.. రన్ వేను వెతుక్కుంటూ, సొంతంగా దారి సరిచూసుకుంటూ పుష్పక్ రాకెట్ భద్రంగా ల్యాండయింది.

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పుష్పక్ రాకెట్ ల్యాండింగ్​ ప్రయోగం విజయవంతమైంది. ఎయిర్ ఫోర్స్ విమానంతో ఈ రీయూజబుల్ లాంచింగ్​ వెహికల్(ఆర్ఎల్​వీ) ను నింగిలోకి తీసుకెళ్లి జారవిడవగా.. రన్ వేను వెతుక్కుంటూ, సొంతంగా దారి సరిచేసుకుంటూ పుష్పక్ రాకెట్ భద్రంగా ల్యాండయింది. సొంత నేవిగేషన్ వ్యవస్థకు తోడు బ్రేక్ పారాచూట్​ను ఉపయోగించుకుని కచ్చితత్వంతో రన్ వే పై ఆగిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం ఉదయం కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ వద్ద ఐఏఎఫ్, ఇస్రో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించింది. రీయూజబుల్ రాకెట్ ను ఇస్రో 2016 లోనే తయారు చేయగా.. తొలి రెండు ప్రయత్నాలతో పాటు తాజాగా మూడోసారి కూడా పుష్పక్ ల్యాండింగ్ ప్రక్రియను సక్సెస్ ఫుల్​గా నిర్వహించింది. అయితే, ఇప్పుడప్పుడే ఈ రీయూజబుల్ రాకెట్​ను ఉపయోగించే అవకాశంలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆర్ఎల్ వీ అందుబాటులోకి వస్తే ఉపగ్రహ ప్రయోగానికి అయ్యే ఖర్చు దాదాపుగా 80% తగ్గుతుందని వివరించారు.

టెస్ట్ జరిగిందిలా..

ఎయిర్​ ఫోర్స్ కు చెందిన చినూక్ హెలికాఫ్టర్​తో పుష్పక్​ను నింగిలోకి తీసుకెళ్లారు. దాదాపు 4.5 కి.మీ.ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్​ను జారవిడిచారు. ల్యాండింగ్​ పాయింట్​ చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లోని రన్ వేకు సుమారు 4 కి.మీ. దూరంలో, 4.5 కి.మీ. ఎత్తులో పుష్పక్​ను జారవిడవగా.. దారి సరిసు కుంటూ రాకెట్ కిందికి దూసుకొచ్చింది. వేగాన్ని నియంత్రించుకుంటూ, రన్ వే వైపుగా దారి సరిచూసుకుంటూ వచ్చింది. రన్ వే సమీపిం చాక స్పీడ్​ తగ్గిస్తూ నిర్దేశిత ప్రాంతంలో ఆగేందు కు పుష్పక్​కు అమర్చిన బ్రేక్ పారాచూట్ విడివడిం ది. ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్ వీల్ స్టీరింగ్​ను స్వయంగా కంట్రోల్ చేసుకుంది. దీనికోసం పుష్పక్​లో ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇస్రో చీఫ్​ సోమ్​నాథ్​ చెప్పారు.

పదేళ్ల క్రితం మొదలైన తయారీ..

పుష్పక విమాన్ తయారీ ప్రక్రియను ఇస్రో పదేళ్ల క్రితమే మొదలు పెట్టింది. దీనికోసం ఇంజనీర్లు, సైంటిస్టులు పదిమందితో ఇస్రో ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం అచ్చంగా విమానాన్ని పోలిన ఈ ఆర్ఎల్ వీని సిద్ధం చేసింది. దీని పొడవు ఆరున్నర మీటర్లు, బరువు 1.75 టన్నులు.. విమానానికి ఉన్నట్లే ల్యాండింగ్ గేర్లతో రెడీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చించింది.

ఎందుకీ ఆర్ఎల్​వీ..

రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఈ ఆర్ఎల్ వీ.. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించి తిరిగి భూమి మీద సేఫ్ గా ల్యాండవుతుంది. ఆపై మరోసారి దీనిని అంతరిక్షంలోకి పంపించే వీలుంటుంది. ఉపగ్రహాల కక్ష్య మార్చాలన్నా, కాలంచెల్లిన వాటిని భూమి పైకి తీసుకురావాలన్నా ఈ ఆర్ఎల్ వీలను ఉపయోగించుకోవచ్చు. దీంతో రాకెట్ ప్రయోగాలకు అయ్యే ఖర్చు తగ్గడంతో పాటు అంతరిక్షంలో పేరుకుపోయే వ్యర్థాలు కూడా తగ్గుతాయని సోమ్​ నాథ్​ వివరించారు. దేశ భవిష్యత్ అవసరాల కోసం దీనిని సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.