రీ పోలింగ్ పెట్టండి.. ఓల్డ్ సిటీలోని 3 సెగ్మెంట్లపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు​

 రీ పోలింగ్ పెట్టండి.. ఓల్డ్ సిటీలోని 3 సెగ్మెంట్లపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు​
  • ఎంఐఎం లీడర్లు రిగ్గింగ్ చేశారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ సిటీలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్​పుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం నేతలు, కార్యకర్తలు రిగ్గింగ్​కు పాల్పడ్డారని, ఈ మూడు సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపు ఆపాలని ఎన్నికల కమిషన్​కు కాంగ్రెస్ ఫిర్యా దు చేసింది. మూడు నియోజకవర్గాల్లో రీ పోలింగ్ పెట్టాలని డిమాండ్ చేసింది. ఇతర పార్టీ నేతలు ఎవరూ పోలింగ్ స్టేషన్​లోకి వెళ్లకుండా ఎంఐఎం లీడర్లు అడ్డుకున్నారని, వాళ్లే గుంపులుగా వెళ్లి రిగ్గింగ్​కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీఈవో వికాస్​రాజ్​కు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారన్నారు.

ఎంఐఎం కార్యకర్తల బెదిరింపులకు పోలింగ్ సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోయారన్నారు. పోలింగ్ ఏజెంట్లను వెళ్లిపోవాలంటూ అక్కడి పోలీసులు, ఎన్నికల అధికారులు ఆదేశించారన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని సీసీ టీవీ కెమెరాలు పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాతే అక్కడి ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేశారు. 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఉంటే.. కేవలం 1.80 లక్షల మందే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నట్లు సీఈవో వికాస్​ రాజ్ చెప్పారన్నారు. మిగిలిన వారికి ఎందుకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.