అణుబాంబుల ప్రయోగంపై పుతిన్ మళ్లీ హెచ్చరిక

అణుబాంబుల ప్రయోగంపై పుతిన్ మళ్లీ హెచ్చరిక
  • మాకు ముప్పు తెస్తే వదిలేది లేదు
  • అణుబాంబుల ప్రయోగంపై పుతిన్ మళ్లీ హెచ్చరిక
  • ఇది బుకాయింపు కాదని పశ్చిమ దేశాలకు స్పష్టీకరణ  
  • ఉక్రెయిన్ లోకి 3 లక్షల రిజర్వ్ బలగాల తరలింపునకు ఆదేశం 
  • రేపటి నుంచి రెఫరెండాలు..  ఉక్రెయిన్ లోని 15 శాతం భూభాగం ఆక్రమణకు ప్లాన్?

మాస్కో: రష్యాకు ముప్పు కలిగించాలని చూస్తే న్యూక్లియర్ వెపన్స్ సహా అన్ని రకాల ఆయుధాలనూ ప్రయోగిస్తామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి హెచ్చరించారు. ‘‘రష్యాను బలహీనపర్చాలని, ముక్కలు చేసి, నాశనం చేయాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ దేశాలు హద్దులు మీరాయి. అయితే, పశ్చిమ దేశాల వద్ద లేని వెపన్స్ కూడా మా వద్ద ఎన్నో ఉన్నాయి. నేను బుకాయించడం లేదు. మా దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే మా ప్రజలను కాపాడుకోవడం కోసం అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలనూ ఉపయోగిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం రష్యన్ ప్రభుత్వ టీవీ చానెల్ ‘రొస్సియా 24 టీవీ’ ద్వారా పుతిన్ ఈ మేరకు స్పీచ్ ఇచ్చారు. ‘‘న్యూక్లియర్ వెపన్స్ తో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. గాలి వాళ్ల వైపు కూడా మళ్లొచ్చు” అని ఆయన హెచ్చరించారు. ‘‘ఉక్రెయిన్ విదేశాల నుంచి నాటో పద్ధతిలో ట్రెయిన్డ్ కిరాయి సైనికులను, మిలిటరీ యూనిట్లను యుద్ధానికి  తెస్తోంది. పశ్చిమ దేశాల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటోంది. ఉక్రెయిన్ ఆర్మీలో నియో నాజీ యూనిట్లు, పశ్చిమ దేశాల మిలిటరీ యంత్రాంగం పాల్గొంటున్నాయి” అని పుతిన్ ఆరోపించారు.  

ఉక్రెయిన్​లోకి రిజర్వ్ బలగాలు 

ఉక్రెయిన్​లో తాము విముక్తి కలిగించిన ప్రాంతాలపై ఉక్రెయిన్ బలగాలు నిరంతరం షెల్లింగ్ చేస్తున్నాయని, అందుకే రిజర్వ్ బలగాలను రంగంలోకి దింపుతున్నామని పుతిన్ చెప్పారు. ‘‘ప్రస్తుత రిజర్వ్ బలగాల్లో సభ్యులుగా ఉన్న పౌరులు, గతంలో ఆర్మీలో పని చేసిన సోల్జర్లు, డాన్ బాస్ వాలంటీర్స్, మిలిటరీ ఎక్స్ పీరియెన్స్ ఉన్న ఇతరులను తరలిస్తున్నాం” అని ఆయన తెలిపారు. ఇందుకోసం డిక్రీపై సంతకం కూడా చేసినట్లు వెల్లడించారు. తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలోని చాలా మంది ప్రజలకు ఉక్రెయిన్ పాలనలో ఉండటం ఇష్టం లేదని, రష్యా కంట్రోల్ లో ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించడమే తమ టార్గెట్​అని పుతిన్ చెప్పారు. 3 లక్షల మంది రిజర్వ్ సోల్జర్లను ఉక్రెయిన్ కు తరలిస్తామని రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు.  

రేపటి నుంచి రెఫరెండాలు 

ఉక్రెయిన్​లో రష్యా కంట్రోల్​లో ఉన్న డోనెట్స్క్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్స్, ఖేర్సన్, జపోరిజియా రీజియన్ లలో ఈ నెల 23 నుంచి రెఫరెండాలు నిర్వహించనున్నట్లు వచ్చిన వార్తలపై,  బలగాల తరలింపుపై పుతిన్ ప్రకటన చేశారు. అయితే, ఈ 4 రీజియన్ లను రెఫరెండం పేరుతో స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించాలని, తద్వారా ఉక్రెయిన్ లోని 15% భూభాగాన్ని రష్యా అధీనంలోకి తెచ్చుకోవాలని పుతిన్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. కాగా, రిజర్వ్ బలగాల తరలింపు రష్యా ఫెయిల్యూర్ కు సంకేతమని ఉక్రెయిన్ లోని అమెరికా రాయబారి బ్రిడ్జెట్ బ్రింక్ అన్నారు.

ప్రధాని మోడీ చెప్పింది కరెక్టే: ఫ్రాన్స్, అమెరికా 

ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ అన్న వ్యాఖ్యలు సరైనవేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. న్యూయార్క్​లో జరుగుతున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. యుద్ధానికి ఇది సమయం కాదంటూ ప్రధాని మోడీ చెప్పిన మాట కరెక్టేనని అన్నారు. సమావేశంలో అమెరికా సైతం మోడీ వ్యాఖ్యలను మెచ్చుకుంది. ఇప్పటికే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలూ మోడీని పొగుడుతూ కథనాలు ప్రచురించాయి.

మా పోరు ఆగదు: జెలెన్ స్కీ 

ఉక్రెయిన్​లోని డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించనున్నట్లు వస్తున్న ప్రకటనలపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తమకు తమ పార్ట్ నర్ కంట్రీస్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పారు.