
కీవ్: ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యా.. చెర్నోబిల్ ప్లాంట్ ను ఆక్రమించింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రష్యా బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయని ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అడ్వయిజర్ మైఖైలో పొడొల్యాక్ తెలిపారు. చెర్నోబిల్ ప్లాంట్ ఇప్పుడు సురక్షితం కాదని ఆయన అన్నారు. రష్యా దాడుల్లో గురువారం తమ దేశంలో 137 మంది పౌరులు మృతి చెందారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమర్ జెలెన్స్కీ వెల్లడించారు. యుద్ధంలో వందలాది మంది గాయపడ్డారని చెప్పారు. దేశం కోసం పోరాడుతున్నవారు, అసువులు బాసినవారు నిజమైన హీరోలని పేర్కొన్నారు. రష్యా తమ దేశంలోని పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. ‘రష్యా బలగాలు అమాయక ప్రజల్ని చంపుతున్నాయి. ప్రశాంతమైన నగరాలను మిలిటరీ టార్గెట్లుగా మారుస్తున్నాయి. ఇది ముమ్మాటికీ తప్పు. వాళ్లను మేం క్షమించం’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.
137 dead after first day of fighting, reports AFP quoting Ukraine's President Volodymyr Zelenskyy
— ANI (@ANI) February 25, 2022
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు గురువారం దాడులు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కివ్, ఒడెసా నగరాల్లో భారీ విస్ఫోటనాలు వినిపించాయి. దేశమంతా వైమానిక దాడులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దీంతో పలువురు ఉక్రెయిన్ పౌరులు నగరాలు విడిచి పారిపోయారు. ఉక్రెయిన్ వైమానిక బలగాలను గంటలోపే తుడిచిపెట్టామని రష్యా ప్రకటించగా.. రష్యా విమానాలను కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ప్రపంచ దేశాల నేతలు రష్యా చర్యను ఖండించారు. రష్యా దీర్ఘకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం: