సంస్కరణలకు ఆద్యుడు

సంస్కరణలకు ఆద్యుడు
  • సంస్కరణలకు ఆద్యుడు
  • ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పునాది వేసిన పీవీ 
  • భూసంస్కరణలతో ల్యాండ్ సీలింగ్ యాక్ట్  
  • తన కుటుంబానికున్న 2 వేల ఎకరాలు పేదలకు పంపిణీ  
  • విద్యారంగంలోనూ మార్పులకు శ్రీకారం.. గురుకులాలకు బీజం

హనుమకొండ, వెలుగు:  మన దేశంలో సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు. భారత రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుపొందిన ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చే సంస్కరణలకు బీజం వేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టారు. నూతన పారిశ్రామిక విధానాలను అమల్లోకి తెచ్చి పెట్టుబడులను ఆకర్షించారు. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పిలుస్తారు. ఆర్థిక సంస్కరణలే కాకుండా భూసంస్కరణలకూ కూడా పీవీనే ఆద్యుడు. 1971లో ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1972లో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ల్యాండ్​సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి, ఆ సంస్కరణలను ముందుగా తన నుంచే అమలు చేశారు. పీవీది ముందు నుంచే భూస్వామ్య కుటుంబం. తన కుటుంబానికి 2 వేల ఎకరాలకు పైగా భూమి ఉండేది.

ఈ క్రమంలో ల్యాండ్​సీలింగ్​యాక్ట్​అమలు కావాలనే ఉద్దేశంతో దాదాపు 2వేల ఎకరాల భూములను నిరుపేదలకు పంచిపెట్టారు. స్వగ్రామం వంగరలో ప్రభుత్వ కార్యాలయాలు, గురుకుల పాఠశాల, పోలీస్​స్టేషన్​ వంటి వాటికి మిగిలిన భూములు కేటాయించారు. అయితే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తేవడంతో భూస్వాములు పీవీపై తిరగబడ్డారు. పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 70 శాతం రిజర్వేషన్​కల్పిస్తూ పీవీ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో1973లో జై ఆంధ్ర ఉద్యమం మొదలవడం, అది కాస్తా పీవీ వ్యతిరేక ఉద్యమంగామారడంతో చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 

విద్యారంగంలోనూ సంస్కరణలు.. 

నేడు మనం గొప్పగా చెప్పుకుంటున్న గురుకులాల వ్యవస్థను తెచ్చింది పీవీనే. 1972లో ఉమ్మడి ఏపీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్​ఎడ్యుకేషనల్​సొసైటీని ఏర్పాటు చేశారు. ముందుగా నల్గొండ జిల్లాలోని సర్వేల్​గ్రామంలో మొట్టమొదటి రెసిడెన్షియల్​స్కూల్​నెలకొల్పారు. ఆ తర్వాత గురుకుల వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించారు. కాలక్రమేణా అన్ని రకాల సొసైటీలకు అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీలను ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చారు. పీవీ స్వగ్రామం వంగరలో ఆయన హయాంలోనే గురుకులాలు ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రిగానూ విద్యావ్యవస్థలో పలు మార్పులకు పీవీ శ్రీకారం చుట్టారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న టైమ్ లో విద్యాశాఖను మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చారు. దానికి మొట్టమొదటి మంత్రి పీవీనే. 1985 నుంచి 1988 వరకు ఈ శాఖను చూసిన ఆయన.. కొత్త జాతీయ విద్యావిధానం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

సామాజిక అసమానతలను తొలగించాలని, విద్యావకాశాల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్​షిప్​లు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఎక్కువ మందిని టీచర్లుగా నియమించడం.. పాఠశాల విద్యను ప్రోత్సహించేందుకు ప్రీ మెట్రిక్​స్కాలర్​ షిప్​పథకం, దేశంలోని ప్రైమరీ స్కూళ్లను డెవలప్​చేయడానికి ‘ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డ్‌’ పథకం పీవీ సంస్కరణల్లో భాగమే. 1985లో  ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రారంభం కావడంలోనూ పీవీ కీలకంగా వ్యవహరించారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 1985లో నవోదయ విద్యా సంఘటన్‌ ఏర్పాటు చేశారు.  ప్రతి జిల్లాలోనూ జవహర్‌ నవోదయ విద్యాలయాలకు శ్రీకారం చుట్టారు.  

వ్యవసాయ రంగంలో టెక్నాలజీకి పెద్దపీట.. 

వ్యవసాయ రంగంలో కొత్త విధానాలు తీసుకురావాలని పీవీ ఆలోచించేవారు. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే తన స్వగ్రామం వంగరకు ఆయన మొదటి ఆయిల్ ఇంజన్​తీసుకొచ్చారు. పీవీ కుటుంబానికి 2 వేల ఎకరాలకు పైగా భూములు ఉండగా.. అందులో కేవలం 10 నుంచి 20 ఎకరాలు మాత్రమే సాగు చేసేవారు. అదే భూమిలో ఉన్న వ్యవసాయ బావి నుంచి ఏతం, మోట ద్వారా పొలాలు పారించేవారు. ఆ బావి నుంచే చేతాళ్లతో వంగర గ్రామస్తులు తాగునీటిని తోడేవారు. వీళ్ల కష్టాలను గమనించిన పీవీ.. 1950 ప్రాంతంలో ఒక ఆయిల్​ఇంజన్ తెప్పించారు. ఇది ఈ ప్రాంతంలోనే మొదటి ఆయిల్​ఇంజన్​గా చెప్తారు. అప్పట్లో ఈ ఆయిల్​ఇంజన్​ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో జనం వచ్చేవారట. అప్పట్లో తెలంగాణలో ఇలాంటి ఇంజన్లు వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో మాత్రమే ఉండడంతో మెకానిక్​లు ఉండేవారు కాదట. దీంతో పీవీ స్వయంగా రిపేరింగ్​నేర్చుకుని రిపేర్లు చేసేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కాగా, వంగరకు మొదటి ట్రాక్టర్ తెచ్చింది కూడా పీవీనే కావడం విశేషం.