ఆర్థికాభివృద్ధిని పట్టాలెక్కించిన ఘనుడు పీవీ

ఆర్థికాభివృద్ధిని పట్టాలెక్కించిన ఘనుడు పీవీ

పాములపర్తి వేంకట నరసింహారావు.  తెలుగుదనానికి నిండైన రూపం. ఢిల్లీ నుంచి పాలన ఎలా ఉండాలో చూపించిన నాయకుడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల నడుమ దక్షిణ భారతం నుంచి తొలిసారి  ప్రధాని పదవిని చేపట్టిన తెలంగాణ బిడ్డ పీవీ.. సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొన్న తీరు అందరికీ ఆదర్శం. ప్రధానమంత్రిగా దేశ దశదిశను మార్చిన అపర చాణక్యుడు. అపూర్వ నాయకత్వ పటిమతో, వాక్పటిమతో, దూరదృష్టితో దేశం రూపు రేఖలు మార్చేశారు. భారత్ లో సంస్కరణల పితామహుడిగా పీవీకి పేరొచ్చిందంటే ఎంతగా ఆయన  కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు.  1991 నుంచి 96 వరకు ప్రధానిగా పని చేసిన పీవీ.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశాన్ని ఆర్థికంగా గాడిన పెట్టారు. రాజకీయాల్లో  చాణక్య నీతిని ప్రదర్శించి మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపి.. దేశ ఆర్థికాభివృద్ధిని పట్టాలెక్కించారు. ఇవాళ పీవీ నరసింహారావు 101వ జయంతి సందర్భంగా కథనమిది. 

వరంగల్ జిల్లా లక్నేపల్లిలో జననం

1921 జూన్ 28న వరంగల్ జిల్లా లక్నేపల్లిలో పీవీ జన్మించారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా వంగరకు వెళ్లింది పీవీ కుటుంబం. భీమదేవరపల్లి మండలంలో నరసింహారావు ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. 1930లో ఆ ప్రాంతంలో జరిగిన వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లోనూ పాల్గొన్నారు పీవీ. పుణెలోని ఫెర్గూసన్ కాలేజీలో లా పూర్తి చేశారు. 1940 టైంలో కాకతీయ పత్రికలో పలు వ్యాసాలు రాశారు. జయ విజయ కలం పేరుతో వ్యాసాలు రాశారు. మొదటి నుంచి పోరాట భావాలు, ఆధునిక భావాలతో పెరిగిన పీవీ నరసింహారావు చదువులో మంచి ప్రతిభ చూపారు. స్వతంత్ర ఉద్యమాల్లో పీవీ చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడిగా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి పీవీ ప్రవేశించారు. 

మంథని నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా..

1957 సంవత్సరంలో మంథని నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. 1962 నుంచి 1973 మధ్య రకరకాల మంత్రిత్వశాఖలు చేపట్టారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంగా పని చేసినప్పుడూ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరూ ఊహించని పథకాలకు ప్రాణం పోశారు. భూసంస్కరణలు, లాండ్ సీలింగ్ యాక్టులను కఠినంగా అమలు చేశారు. భారత్ లో సాహసోపేతంగా భూసంస్కరణల చట్టం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రిగా పీవీకే దక్కింది. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పీవీ నరసింహారావు.. తమకున్న 1000 ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీతో శెభాష్ అనిపించుకున్నారు పీవీ. ఆయన హయాంలోనే ‘జై ఆంధ్ర’ ఉద్యమం మొదలవడంతో కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 

ప్రభుత్వ రంగంలో మొదటి రెసిడెన్షియల్ పాఠశాల

పీవీ సీఎంగా పని చేసిప్పుడు దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ రంగంలో మొదటి రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పారు. 1972లో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో సర్వేల్ గ్రామంలో తొలి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు తర్వాత.. ఇలాంటి స్కూళ్లు ఉమ్మడి రాష్ట్రమంతా విస్తరించారు. వీటితో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి చదువులో చురుగ్గా ఉన్న విద్యార్థులకు చాలా మేలు జరిగింది. ఎందరో విద్యార్థులు వీటిలో చదువుకుని ప్రతిభావంతులు అయ్యారు. ఏ పదవి చేపట్టినా అందరిలా కాకుండా.. తన మార్క్ చూపించారు. అందుకే పీవీ ఖ్యాతి జగద్విఖ్యాతమైంది. సంస్కరణలకు కేరాఫ్ గా, కొత్త ఆలోచనలతో పాలనను పీవీ నరసింహారావు పరుగులు పెట్టించారు. 

తెలుగుకు అధికార భాషగా పునాదులు

ఉమ్మడి రాష్ట్రంలో పని చేసినప్పుడు తెలుగుకు అధికార భాషగా పునాదులు వేసిన ఘనత పీవీకే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా పని చేసిన పీవీ.. ఎన్నో కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ పీవీ మానస పుత్రికే. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ పీవీ నరసింహారావు పని చేశారు. మార్కులు ముఖ్యం కాదని, తెలివి కోసమే చదువు నేర్చుకోవాలన్న సూత్రాన్ని పీవీ అమలు చేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయిల్లో తెలుగు మీడియం ప్రవేశపెట్టడం, తెలుగు వ్యాప్తిలో విశ్వవిద్యాలయాలకు సహాయం చేయడం, పరిశోధనలు చేయడం వంటి లక్ష్యాలు పీవీ నిర్దేశించారు. ఐఏఎస్, ఐపీఎస్ సహా రాష్ట్ర పరిధిలోని గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు పీవీ పెట్టిన గురుకులాల్లో చదివిన వారిలో చాలా మంది ఎంపికయ్యారు. 

ఇందిరాగాంధీకి సంపూర్ణ మద్దతు

పీవీ నరసింహారావు మొదటి నుంచీ ఇందిరాగాంధీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తన వ్యక్తిత్వం, తన పాండిత్యం, తన ప్రతిభ ఆధారంగానే పదవులు పొందారు. దేశ రాజకీయాల్లో క్రమక్రమంగా ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం పీవీది. అందుకే మాటల్లో పరుష పదజాలం ఉండదు. దూకుడు వైఖరి ఉండదు. ఏం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది? ఏ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? వాటిని ప్రజలకు అందించడం ఎలా? ప్రజలను చైతన్యం చేయడం ఎలా ? వీటి చుట్టే పీవీ ప్రస్థానం సాగింది. అపర చాణక్యుడిగా పేరు సంపాదించిన పీవీ జీవిత చరిత్ర ఈకాలం వారికి ఎంతో స్ఫూర్తి నింపుతుంది. 

ఏ పోర్ట్ ఫోలియా తీసుకున్నా తనదైన ముద్ర 

1972 తర్వాత ఢిల్లీకి వెళ్లారు పీవీ నరసింహారావు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖలు నిర్వర్తించారు. ఏ పోర్ట్ ఫోలియా తీసుకున్నా.. అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో హోంశాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాలు ఇలా కీలకమైన శాఖల్లో తన మార్క్ చూపారు. రాజీవ్ గాంధీ హయాంలో ఉన్నత విద్యా శాఖలో మార్పులు చేసి మానవ వనరుల శాఖను సృష్టించి, ఎన్నో సంస్కరణలకు పెద్ద పీట వేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆంతరంగిక సలహాదారుగానూ పీవీ వ్యవహరించారు. రాష్ట్రంలో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఆమె ప్రసంగాలను పీవీ తెలుగులోకి అనువదించేవారు. అపర చాణక్యుడిగా, బహు భాషా కోవిదుడిగా, సాహితీవేత్తగా పీవీ పేరు చిరస్మరణీయం. 

రాజకీయాల నుంచి వైదొలిగే సమయంలో..

రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టిన తర్వాత ఇక క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగే సమయంలో పీవీ నరసింహారావు... ఏకంగా ప్రధాని పదవి చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్ గాంధీ మానవబాంబు దాడిలో చనిపోవడం... 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ రాకపోయినా అత్యధిక సీట్లు గెలవడంతో పీవీ నరసింహారావు నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అసలు ప్రధాని పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉంది. ఆ సమయంలో శంకర్ దయాళ్ శర్మను పిలిచారు. వయో భారంతో పదవి చేపట్టలేనని ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత పీవీని ఎంపిక చేశారు. కీలక శాఖలు నిర్వర్తించిన అనుభవం ఉండడం, 17 భాషలపై పట్టు ఉండడం, సంక్షోభ సమయంలో అన్ని విధాలా అర్హుడని భావించడం, కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు పీవీ పేరును సూచించడంతో ప్రధానమంత్రి పదవిని పీవీ నరసింహారావు చేపట్టారు. 

ఆర్థిక సంక్షోభం వెల్ కమ్

పీవీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభం వెల్ కమ్ చెప్పింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ద్రవ్యలోటు, విదేశీ మారక నిల్వల తగ్గుదల ఇలాంటి సమస్యలు 1985లో మొదలై... 1991 నాటికి చాలా క్షీణత ఏర్పడింది. దిగుమతులకు డబ్బులు చెల్లించడానికి విదేశీ మారక నిల్వలు కూడా లేని దారుణమైన పరిస్థితి. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితిలో పీవీ రాజదండం చేపట్టారు. 2 వారాల దిగుమతులకు సరిపోయే విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. 2 వారాలు దాటితే భారత్ చెల్లించలేని పరిస్థితిలోకి వెళ్తుంది. ద్రవ్యోల్బణం 16 శాతానికి పైగా పెరిగింది. ఇవన్నీ పీవీ గమనించారు. ప్రమాణస్వీకారం తర్వాత ఇంటికెళ్లి మన్మోహన్ సింగ్ కు ఫోన్ చేశారు పీవీ. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను నియమించుకున్నారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని అలా ఏకంగా మంత్రిగా నియమించుకోవడం అదే మొదటి సారి. అలాంటి సాహసం, అలాంటి ఆలోచన చేయడం పీవీకే చెల్లింది. ఇప్పుడు మోడీ హయాంలో విదేశాంగ మంత్రిగా జైశంకర్ ఉన్నారు. ఆయనకూ రాజకీయాలతో సంబంధం లేదు. 

IMF, లండన్ బ్యాంకులకు బంగారం తరలించి..

పరిశ్రమల శాఖను పీవీ తన దగ్గరే ఉంచుకున్నారు. ఆర్థిక శాఖ సహాయమంత్రితో పరిశ్రమల విధానాన్ని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టించారు. రూపాయి విలువను 18 శాతం తగ్గించారు. IMF, లండన్ బ్యాంకులకు బంగారం తరలించి విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. లైసెన్స్ పర్మిట్ రాజ్ కు పచ్చజెండా ఊపారు. దిగుమతి సంకాలు, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నును క్రమంగా తగ్గించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. దీంతో 1992-97 ప్రణాళికా కాలంలో ఆర్థికాభివృద్ధి రేటు సగటున 6.5 శాతం సాధించారు. పీవీ అధికారంలో ఉన్న చివరి రెండేళ్లలో ఆర్థికాభివృద్ధి రేటు 7.5 శాతం. 1991లో అట్టడుగుకు చేరిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1995 నాటికి 25.1 బిలియన్ డాలర్లకు వెళ్లాయంటే పీవీ చేపట్టిన సంస్కరణలు ఎంత ప్రభావవంతమో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పేరు తెచ్చుకుంది. 

మన్మోహన్ సింగ్ కు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు

విదేశీ వ్యవహారాల్లోనూ పీవీ కీలక పాత్ర పోషించారు. తూర్పు ఆసియా దేశాలను అప్పటిదాకా భారత్ పట్టించుకోలేదు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు ఆర్థికంగా దూసుకెళ్తూ ఆసియా టైగర్లుగా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటే.. ఆ దేశాలను పక్కన పెట్టడం సరికాదని లుక్ ఈస్ట్ పాలసీ విధానాన్ని ప్రతిపాదించి, సంబంధాలను పెంపొందించి, వాణిజ్యాన్ని పెంచేలా చేశారు పీవీ. ప్రధాని పదవి చేపట్టాక తన చుట్టూ కీలకమైన నమ్మకమైన వ్యక్తులను నియమించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే పీవీ మాత్రం ఈ విషయంలో ప్రతిభకే పట్టం కట్టారు. చలాకీ అధికారులను చేర్చుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ కు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం దగ్గర్నుంచి, ప్రతిపక్షానికి చెందిన సుబ్రమణ్యస్వామి వంటి వారికి క్యాబినెట్ హోదా ఇవ్వడం, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయిని ఐక్యరాజ్య సమితిలో కీలక సమావేశానికి భారత ప్రతినిధిగా పంపడం ఇవన్నీ ఆశ్చర్య పరిచేవే. 

వాజ్ పేయి హయాంలో నెరవేరిన పీవీ కల 

ఆసియా అంటే చైనా, జపాన్ లే కాదు.. భారత్ కూడా అని గర్వంగా చెప్పుకునేలా చేశారు పీవీ నరసింహారావు. 1992లో ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెరిపించి.. ఆ దేశంలో స్నేహ సంబంధాలు నడిపారు. అటు ఇరాన్ తోనూ స్నేహ, వాణిజ్య బంధానికి బాటలు వేశారు పీవీ. భారత్.. అణ్వస్త్ర దేశం కావాలని, క్షిపణి, అణు ప్రయోగాలు చేయాలని అనుకున్నారు. 1996 లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. అబ్దుల్ కలాంకు అణ్వస్త్ర పరీక్షకు రెడీ కావాలని ఆదేశించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రయోగం ఆగిపోయింది. ఆ తర్వాత 1998లో వాజ్ పేయి హయాంలో పోఖ్రాన్ లో అణు పరీక్ష జరగడం ద్వారా పీవీ నరసింహారావు కల నెరవేరింది. 

 పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే బాబ్రీ ఘటన 

నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయమే. పీవీ హయాంలో ఇది కూడా ఓ ఆశ్చర్య పరిచే విషయమే. భారత దేశ అభివృద్ధికి ఎంతో చేయాలని కలలు కన్నారు. ఐదేళ్ల పాటు మైనార్టీ ప్రభుత్వాన్ని సాహసోపేతంగా నిర్వహించి... కొన్నైనా చేయగలిగారంటే పీవీ నరసింహారావు సమర్థతే కారణం. ప్రత్యర్థులు ఎన్నో కేసులు పెట్టినా అన్నిటి నుంచి నిర్దోషిగా బయటపడ్డారు పీవీ. మైనార్టీ ప్రభుత్వం నడిపిన పీవీకి మొదటి నుంచీ గ్రూపులు నడపడం ఇష్టం లేదు. అయితే గిట్టని వారు ఎప్పుడూ ఏదో రకంగా ఆటంకాలు సృష్టించినా చాలా కూల్ గా అన్నిటినీ ఎదుర్కొన్నారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే బాబ్రీ ఘటన జరిగింది. సమస్యను రెండు వర్గాలతో కలిసి సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినా వీలు పడలేదు. 1996లో ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి.. రాజకీయంగా ఏకాంతంగానే గడిపారు. చివరి రోజుల్లో పుస్తకాలు, రచనలే లోకంగా ఏకాంత జీవితం గడిపారు. ఇన్ సైడర్ పీవీ ఆత్మకథ. ఇందులో జీవిత విశేషాలెన్నో ఉన్నాయి.