కామన్వెల్త్‌ క్రీడల్లో సింధుకు పసిడి పతకం

కామన్వెల్త్‌ క్రీడల్లో సింధుకు పసిడి పతకం

కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. ఇవాళ జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘనవిజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21–15, 21–13 తో అలవోకగా నెగ్గింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది.

కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.

పీవీ సింధుకు మోడీ, కేసీఆర్ విషెస్

కామన్వెల్త్ లో తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. బాడ్మింటన్ ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్ లీని వరుస సెట్లలో ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు సింధుకు విషెస్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా అభినందించారు. అలాగే సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.