
టోక్యో ఒలింపిక్స్ లో భారత షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన స్టార్ షట్లర్.. తన ఖాతాలో మరో ఒలింపిక్ మెడల్ వేసుకుంది. చైనా ప్లేయర్ హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు సెట్లలో గెలిచిన సింధు భారత జెండాను రెపరెపలాడించింది. ఫస్ట్ గేమ్ ను 8 పాయింట్ల తేడాతో అలవోకగా గెల్చుకున్న సింధు.. రెండో సెట్‌లో కాస్త చెమటోడ్చింది. అయితే 6 పాయింట్ల తేడాతో ఈ సెట్‌లో కూడా నెగ్గి రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళా స్పోర్ట్స్‌పర్సన్‌గా రికార్డు క్రియేట్ చేసింది. శనివారం జరిగిన సెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిన సింధు.. ఇవ్వాళ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తనదైన శైలిలో రఫ్ఫాడించింది. గ్రౌండ్ మొత్తం కలియతిరుగుతూ పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడింది. చివరి వరకు అదే ఊపును కొనసాగించి రెండో సెట్‌ను కైవసం చేసుకొని కాంస్యంతో మెరిసింది.