ఆర్సీ, లైసెన్స్‌‌‌‌పై ‘క్యూఆర్ ’ కోడ్

ఆర్సీ, లైసెన్స్‌‌‌‌పై ‘క్యూఆర్ ’ కోడ్

రెడ్ సిగ్నల్ ను జంప్ చేస్తున్నారా? స్టాప్ లైన్ దాటి ముందుకొచ్చి బండిని ఆపుతున్నారా? హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా రయ్యున దూసుకుపోతున్నారా? అలాగే చేస్తుంటే .. ఇకపై జాగ్రత్త సుమా! ట్రాఫిక్ ను ఉల్లంఘించే వారి ఆటలు ఇకపై చెల్లవు. ఎందుకంటే .. ‘కొత్త’ డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులు రాబోతున్నాయి. దేశంలో ఇకపై అన్నీ ఒకే రంగు, ఒకే రూపంతో ఉండబోతున్నాయి. దానికి అదనంగా కార్డులపై ‘క్యూఆర్ ’ కోడ్ ఉండనుంది. ఆ క్యూఆర్ కోడే మన ఉల్లంఘనల జాతక చిట్టా విప్పుతుంది. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి తప్పించుకోవడమన్నది ఇకపై కుదరనిపని. ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులు ఆపి.. మన డీఎల్ లేదా ఆర్సీని స్కాన్ చేశారంటేచాలు.. అన్ని వివరాలు తెలిసిపోతాయి. సెంట్రల్ ఆన్ లైన్ డేటాబేస్ లో ఉండే సదరు డ్రైవర్, బండికి సంబంధించిన వివరాలు, ఉల్లంఘనలు బయటపడతాయి. ‘అక్టోబర్ 1’ నుంచే ఈ కొత్త కార్డులు అమల్లోకి రాబోతున్నాయి.

అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త విధానాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందేనని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేసింది. అయితే, వాటికి అదనంగా చిప్ పెట్టుకోవాలా వద్దా అన్నది రాష్ట్రాల ఇష్టమని పేర్కొంది. ఆ చిప్పులు డ్రైవర్ లేదా వాహనానికి సంబంధించిన పదేళ్ల వివరాలను స్టోర్ చేసుకునేలా ఉండాలని సూచించింది. దాంతో పాటు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ ఎఫ్ సీ) అనే ఫీచర్ నూ రాష్ట్రాలకే వదిలేసింది. ‘‘చిప్ , ఎన్ ఎఫ్ సీని తప్పనిసరి చేయాలని కేంద్రం భావించినా.. ఆ నిర్ణయాన్ని మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది” అని ఓ అధికారి చెప్పారు.

అవయవదానం చేస్తానని…
ఆ ఫీచర్లే కాదు.. మరో కొత్త అంశమూ డ్రైవింగ్ లైసెన్సుల్లో ఉంది. అవయవాలను దానం చేస్తానని డిక్లరేషన్ లో మాటివ్వాలి . దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలైతే.. ఆ విషయాన్ని డిక్లరేషన్ లో పేర్కొనాలి. ‘‘వివిధ రాష్ట్రాల్లో కార్డుల రంగులు, ఫార్మాట్ , సమాచారం పెడుతున్న చోటు వేర్వేరుగా ఉంటున్నాయి. కార్డుల నాణ్యతలోనూ లోపాలున్నాయి. కార్డులు ముద్రించిన కొద్ది రోజులకే దానిపై ఉన్న ప్రింట్ పోతోంది. అంత నాసిరకం ప్రింట్ ను వాడుతున్నాయి కొన్ని రాష్ట్రాలు. అందుకే కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది” అని మరో అధికారి చెప్పారు.