పరస్పర విశ్వాసమే క్వాడ్ బలం

పరస్పర విశ్వాసమే క్వాడ్ బలం

అతి తక్కువ టైమ్ లో ప్రపంచం ముందు క్వాడ్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందన్నారు ప్రధాని మోడీ. జపాన్ రాజధాని టోక్యో వేదికగా.. క్వాడ్ దేశాధినేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.... జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ..నాలుగు దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి తక్కువ టైమ్ లో ప్రపంచం ముందు తనదైన స్థానాన్ని సంపాదించుకుందని, దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ప్రజాస్వామిక విలువల పాలనే క్వాడ్ కూటమికి ప్రధాన బలమన్నారు. క్వాడ్ దేశాల మధ్య విశ్వాసం, సంకల్పం.. ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సహాన్ని ఇస్తున్నాయన్నారు. ఇండో- పసిఫిక్ లో శాంతి కోసం ప్రయత్నాలు చేస్తుందన్న మోడీ.. కరోనా కష్ట కాలంలో సభ్య దేశాల మధ్య వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందిందని తెలిపారు. ప్రధానిగా ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధానిని ప్రత్యేకంగా మోడీ అభినందించారు. సదస్సుకు ముందు బైడెన్, కిషిదా, అల్బనీస్ తో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రధాని మోడీ చర్చించారు. 

మంగళవారం ఉదయమే వేదికపైకి చేరుకున్న నాలుగు దేశాల అధినేతలు పరస్పరం షేక్ హ్యాడ్, పలకరింపులు, ఫొటోషూట్ తో సందడి చేశారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ మాదిరిగా కూర్చొని నలుగు నేతలూ షార్ట్ గా ప్రారంభ ఉపన్యాసాలు చేశారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో క్వాడ్ కూటమే శక్తిమంతమైనదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. క్వాడ్ కేవలం తూతూమంత్రపు వ్యవహారం కాదని, భావితరాల శ్రేయస్సు దృష్ట్యా సమ్మిళిత అభివృద్ధి, భాగస్వామ్యుల శ్రేయస్సు కోసమే ఏర్పడిందని క్వాడ్ సదస్సు ప్రారంభఉపన్యాసంలో ఆయన చెప్పారు.