
- ఇయ్యాల క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు
- అధికారిక లాంఛనాలతో రాణికి వీడ్కోలు పలకనున్న బ్రిటన్
- విండ్సర్ క్యాజిల్ వద్ద తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఖననం
లండన్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం లండన్ కు సమీపంలోని బెర్క్ షైర్ కౌంటీలో ఉన్న విండ్సర్ క్యాజిల్ గ్రౌండ్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. క్వీన్ రెండో ఎలిజబెత్ వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం కారణంగా ఈ నెల 8న 96 ఏండ్ల వయసులో కన్నుమూశారు. అప్పటి నుంచి పది రోజులుగా సంతాప దినాలు ప్రకటించిన బ్రిటన్ సర్కారు.. ప్రొటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలను నిర్వహించింది. సోమవారం ఉదయం వెస్ట్ మినిస్టర్ అబే చర్చ్‌లో అంతిమ సంస్కారాలు పూర్తయిన తర్వాత అక్కడికి 20 మైళ్ల దూరంలో ఉన్న విండ్సర్ క్యాజిల్ వద్ద ఉన్న సెయింట్ జార్జ్ చాపెల్ గ్రౌండ్‌కు క్వీన్ పార్థివదేహంతో అంతిమయాత్ర నిర్వహించనున్నారు. వెస్ట్ మినిస్టర్ అబే వద్ద అంతిమ సంస్కారాల ముగింపు సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు క్వీన్ అంతిమయాత్ర వెస్ట్ మినిస్టర్ అబే నుంచి ప్రారంభమవుతుంది. అంతిమయాత్రలో కింగ్ చార్లెస్, రాచకుటుంబసభ్యులు పాల్గొంటారు.
తల్లిదండ్రుల సమాధుల పక్కనే..
విండ్సర్ క్యాజిల్ క్వీన్‌కు చాలా ఇష్టమైన ఇల్లు. ఇక్కడి గ్రౌండ్ లోనే ఆమె తల్లిదండ్రులు కింగ్ జార్జ్ 4, క్వీన్ ఎలిజబెత్, సోదరి ప్రిన్సెస్ మార్గరెట్‌లను ఖననం చేశారు. ఇప్పుడు వారి సమాధుల పక్కనే క్వీన్ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. క్వీన్ భర్త ప్రిన్స్ ఫిలిప్‌ను ఇదే ప్లేస్‌లో రాయల్ వాల్ట్‌లో ఖననం చేశారు. ఇప్పుడు ఆయన శవపేటికను కూడా క్వీన్ సమాధి పక్కకు చేర్చి ఖననంచేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ముర్ము సహా 2 వేల మంది వరల్డ్ లీడర్ల హాజరు..
క్వీన్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ముర్ము, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సహా అనేక దేశాల అధినేతలు, ప్రతినిధులు 2 వేల మంది వరకూ హాజరుకానున్నారు.
లాస్ట్ జర్నీ.. 804 కిలోమీటర్లు
క్వీన్ ఎలిజబెత్ 2 స్కాట్లాండ్ లోని బల్మోరల్ క్యాజిల్ లో ఈ నెల 8న మరణించారు. అప్పటి నుంచి రాచకుటుంబ సంప్రదాయాల ప్రకారం మొదట ఎడిన్ బరోకు అక్కడి నుంచి బకింగ్ హామ్ ప్యాలెస్ కు ఆ తర్వాత వెస్ట్ మినిస్టర్ అబే చర్చ్ కు క్వీన్ పార్థివదేహాన్ని తరలించి, అధికారిక లాంఛనాలు నిర్వహించారు. చివరగా విండ్సర్ క్యాజిల్ కు చేరుకునేసరికి క్వీన్ పార్థివదేహం సుమారు 804 కి.మీ. దూరం అంతిమయాత్ర చేసినట్లు అవుతుంది. క్వీన్ ఎలిజబెత్ 2 అంతిమయాత్ర, అంత్యక్రియలను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా అనేక పార్కులు, సినిమా థియేటర్ల వద్ద భారీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. సోమవారం బ్రిటన్ అంతటా పబ్లిక్ హాలిడే ప్రకటించారు. క్వీన్ అంత్యక్రియలకు సుమారు10 లక్షల మంది హాజరుకానున్నట్లు లండన్ రవాణా శాఖ అంచనా వేసింది.