- ధర్నాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం: ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు ధర్నాలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. సోమవారం హైదరాబాద్లోని విద్యా నగర్ బీసీ భవన్ లో విద్యార్థులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఫీజు బకాయిలు విడుదల చేయాలని రెండేళ్ల నుంచి 86 సార్లు విద్యార్థులతో కలిసి ధర్నాలు, రాష్ట్ర బంద్ చేసినా ప్రభుత్వం దిగి రాకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఫీజుల కోసం బడ్జెట్ విడుదల చేయడం లేదని నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు కోటా ఇవ్వడం లేదని విమర్శించారు. కోర్టు తీర్పును అడ్డంపెట్టి రీయింబర్స్మెంట్ స్కీమును ఎత్తివేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే అగ్రకుల పాలకులు ఓర్వ లేకపోతున్నారని అందుకే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం దాకా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకంపై ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని లేదంటే 14 లక్షల మంది విద్యార్థులతో మరో తెలంగాణ ఉద్యమం మొదలుపెడతామని హెచ్చరించారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సతీశ్ అధ్యక్షతన, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు అంజి నేతృత్వంలో శివకుమార్, కృష్ణయ్య, శివ, నిఖిల్, వంశీ, రవికుమార్, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.
