ఎవరికి దక్కేనో.. జడ్పీ పీఠం.. నల్గొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ జనరల్

ఎవరికి దక్కేనో.. జడ్పీ పీఠం.. నల్గొండ ఎస్టీ, సూర్యాపేట  బీసీ జనరల్
  • కలిసొచ్చిన రొటేషన్ సిస్టమ్
  • ఆరు నియోజకవర్గాలపై అందరి దృష్టి 

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్​ చైర్మన్​స్థానాలు ఎవరికి దక్కనున్నాయోననే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది. జిల్లాల విభజన జరిగిన తర్వాత తొలిసారిగా సూర్యాపేట జడ్పీ స్థానం బీసీలకు రిజర్వుకాగా, నల్గొండ జిల్లాలో మొదటి సారి ఎస్టీ మహిళలకు చైర్మన్​అయ్యే చాన్స్​ దక్కింది. బీసీల రిజర్వేషన్​ 42 శాతం పెంపు వల్ల వారికి కలిసొచ్చింది. దీంతో తొలిసారి ఉమ్మడి జిల్లాలో జనరల్​ అభ్యర్థులు చైర్మన్​ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. 

బీసీలకు వచ్చిన అదృష్టం ఎవరిని వరిస్తుందో చెప్పలేకపోయినప్పటికీ గతంలో సమీకరణాలను పరిశీలిస్తే ఆరు నియోజకవర్గాలపైనా అందరి దృష్టి నెలకొంది.  నాగార్జునసాగర్, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి,  మునుగోడు నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకే జడ్పీ చైర్మన్​అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నల్గొండ జిల్లా ఎవరికి దక్కేనో? 

నల్లగొండలో ఎస్టీ మహిళకు రిజర్వు అయిన మండలాలు పెద్దవూర, దేవరకొండలో డిండి మండలాలు మాత్రమే ఉన్నాయి. ఎస్టీ జనరల్​ స్థానాల్లో  పీఏపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలు ఉన్నాయి. 

గతంలో ఎస్టీ జనరల్​ అయినప్పుడు దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌‌కు  కాంగ్రెస్​ నుంచి చైర్మన్​అయ్యారు. అప్పుడు నాగార్జునసాగర్​ నుంచి పెద్దవూర జడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి వైస్​ చైర్మన్​అయ్యారు. నాగార్జునసాగర్​ నుంచి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎస్టీలకు ప్రాతినిధ్యం లేదు. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ శంకర్​నాయక్​ మిర్యాలగూడ పరిధిలోని దామర చర్ల మండలం.  

పైగా నాగార్జునసాగర్​ జానారెడ్డి సొంత నియోజకవర్గం, ఎస్టీలు అత్యధికంగా ఉన్న ప్రాంతం. ఇక్కడి నుంచి ఎ న్నికైన జడ్పీటీసీకి చైర్మన్​ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్టీలు అత్యధికంగా ఉన్న తిరుమలగిరి సాగర్​ మండలం కూడా జనరల్​అయ్యింది. ఇక్కడి నుంచి  ఎస్టీ మహిళ పోటీ చేసే అవకాశం ఉంది. రాజకీయ సమీకరణాలు కుదిరితే చైర్మన్​ పీఠం వాళ్లదే అవుతుంది.

సూర్యాపేట వర్సెస్​ కోదాడ

బీసీలు అత్యధికంగా ఉన్న సూర్యాపేట జిల్లాలో చైర్మన్​ సీటు పై గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో తుంగతుర్తి జడ్పీటీసీ గుజ్జ దీపిక (ఓసీ మహిళ) చైర్మన్​ అయ్యారు. ఈసారి బీసీ జనరల్​ కావడంతో సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులు ఛాన్స్​ కోసం  ఎదురుచూస్తున్నారు. సూర్యాపేటలో బీసీ జనరల్​ పెన్​పహాడ్​, నడిగూడెం, కోదాడ, హుజూర్​నగర్‌‌‌‌లో గరిడేపల్లి, తుంగతుర్తిలో నాగారం మండలాలు ఉన్నాయి. 

మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి హుజూర్​నగర్​ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందున సూర్యాపేట బీసీలకు చైర్మన్​ అవకాశం కల్పిస్తే జిల్లా కేంద్రానికి  రెండో కేబినెట్​హోదా ఇచ్చినట్టు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

కుల సమీకరణాలకే ప్రయార్టీ..

సూర్యాపేట జిల్లాలో చైర్మన్​ఎంపిక ప్రధానంగా కుల సమీకరణాలకే ప్రయార్టీ ఇస్తున్నారు. గతంలో రెండు జడ్పీలు జనరల్​, సూర్యాపేట మహిళలకు రిజర్వు అయినప్పుడు నల్గొండ, యాదాద్రి రెడ్డి వర్గానికి, సూర్యాపేట వెలమ వర్గంతో భర్తీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పదవుల పంపకాల్లో సైతం నల్లగొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ, యాదాద్రి రెడ్లకు ఇచ్చారు. ఇదే విధానం ఈ ఎన్నికల్లోనూ కొనసాగించక తప్పదని సీనియర్లు అంటున్నారు.  గౌడ, యాదవ, పద్మశాలీ, మున్నూరుకాపు, ముదిరాజ్​సామాజిక వర్గాలు బలంగా ఉన్న ఈ  రెండు జిల్లాలో ఏ కులానికి ప్రాధాన్యత దక్కుతుందో వేచి చూడాల్సిందే.