మహిళలకు రాచకొండ పోలీస్ భరోసా

మహిళలకు రాచకొండ పోలీస్ భరోసా
  •       వేధింపులకు గురి చేసిన వారిపై 6 నెలల పాటు నిఘా
  •      ‘విమెన్స్ సేఫ్టీ సర్వెలెన్స్‌ రిజిస్టర్’ రికార్డ్‌ ఆవిష్కరించిన సీపీ సుధీర్‌‌బాబు

హైదరాబాద్‌, వెలుగు : విమెన్‌ సేఫ్టీ కోసం రాచకొండ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు భరోసానిచ్చే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్’ (విమెన్స్ సేఫ్టీ సర్వెలెన్స్‌ రిజిస్టర్)పేరుతో రికార్డ్‌ను రూపొందించారు. ఈ రికార్డ్‌ ఆధారంగా మహిళలను వేధిస్తున్న ఆకతాయిలు, పోకిరీలపై పటిష్ట నిఘా పెట్టనున్నారు. రిజిస్టర్‌‌ను రాచకొండ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్

ఏసీపీ వెంకటేశంతో కలిసి సీపీ సుధీర్‌‌బాబు శుక్రవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను వేధించే నిందితులను నిరంతరం ట్రాక్ చేస్తుంటామని తెలిపారు. ఆరు నెలలు ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు.ఈ రిజిస్టర్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

సర్వెలెన్స్‌ రిజిస్టర్ పనిచేస్తుంది ఇలా..

మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడే నిందితుల డేటా రికార్డ్‌ చేస్తారు. బాధిత మహిళలు ఎలాంటి వేధింపులకు గురయ్యారనే వివరాలను పొందుపరుచుతారు. నిందితులు మళ్లీ వేధింపులకు గురిచేశారనే వివరాలు సేకరిస్తుంటారు. ఇలా 6 నెలల పాటు నిందితులను ట్రాక్‌ చేస్తుంటారు. మళ్లీ మహిళలను వేధిస్తున్నారానే కోణంలో నిఘా పెడతారు. పోలీసులకు పట్టించిన బాధితులపై కక్ష పూరిత వేధింపులు, దాడులు జరుగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు.

బాధితుల రక్షణ స్థానిక పోలీసులదే

బాధితులు నివాసం ఉండే స్థానిక పోలీస్‌ స్టేషన్లకు చెందిన స్టేషన్‌ హౌస్ ఆఫీసర్‌‌,సెక్టార్ ఎస్సైల ఆధ్వర్యంలో రిజిస్టర్ ఆపరేట్‌ చేస్తారు. బాధితుల వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బాధితులు,వారి కుటుంబ సభ్యులను సంప్రదిస్తుంటారు. ఫోన్ ద్వారా లేదా అవసరమైతే వ్యక్తిగతంగా ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తుంటారు. పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌‌లో రికార్డ్‌ చేస్తారు. ఇదే సమాచారం విమెన్ సేఫ్టీ వింగ్‌, షీ టీమ్స్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రికార్డ్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

గతంలో లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్తులు మళ్లీ అలాంటి నేరాలు కానీ ఇతర నేరాలకు పాల్పడకుండా పటిష్టమైన నిఘా కొనసాగిస్తారు. ఈ క్రమంలోనే మహిళలకు రక్షణ కలిపించే విధంగా షీ టీమ్స్‌ డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుందని సీపీ సుధీర్‌ ‌బాబు తెలిపారు. ఆవారాలు, పోకిరీలపై బాధిత మహిళలు ధైర్యంగా సమాచారం ఇవ్వాలని సూచించారు.