రేడియేషన్ థెరపీ.. ఇక ఒక్క సెకనే

రేడియేషన్ థెరపీ.. ఇక ఒక్క సెకనే

కేన్సర్ కు ‘ఫ్లాష్ రేడియోథెరపీ’ని కనుగొన్న సైంటిస్టులు
ఎలక్ట్రాన్లకు బదులుగా ప్రోటాన్లు వాడుతరు 
సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ

కేన్సర్ పేషంట్లకు రోగం కంటే ట్రీట్​మెంట్ బాధే ఎక్కువగా ఉంటది. వారాల తరబడి ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వల్ల ఏం తిన్నా, తాగినా వాంతులవుతాయి. వెంట్రుకలు రాలిపోతాయి. కొన్ని అవయవాలు ఫెయిలయ్యే ప్రమాదమూ ఉంటది. మొత్తానికి చాలామంది కేన్సర్ పేషెంట్లు బతికుండగానే నరకం చూస్తుంటరు. ఇకపై కేన్సర్ పేషెంట్లకు ఈ బాధలు తప్పనున్నాయి. ఇప్పుడు వారాల తరబడి ఇస్తున్న రేడియేషన్ థెరపీ ఫ్యూచర్​లో జస్ట్ ఒకే ఒక్క సెకనులో పూర్తి కానుంది! అమెరికాలోని పెనిసిల్వేనియా యూనివర్సిటీ సైంటిస్టులు ఇందుకోసం ‘ఫ్లాష్​ రేడియోథెరపీ’ అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు. ప్రస్తుతం రేడియేషన్ థెరపీ కోసం డాక్టర్లు ఎలక్ట్రాన్లను వాడుతున్నారు. కానీ ఎలక్ట్రాన్లకు బదులుగా ప్రోటాన్లను వాడితే జస్ట్ ఒక్క సెకన్​లోనే రేడియేషన్ థెరపీ మొత్తం కంప్లీట్ చేయొచ్చని అమెరికా సైంటిస్టులు చెప్తున్నారు. ఈ దిశగా ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తాము సక్సెస్ అయ్యామని, త్వరలో మనుషులపైనా ఈ పద్ధతిని పరీక్షిస్తామని వారు వెల్లడించారు.

ప్రోటాన్లతో ట్రీట్ మెంట్..

రేడియేషన్ థెరపీలో కేన్సర్ కణాలను చంపేందుకు హైఎనర్జీ బీమ్స్​ను పంపుతారు. ప్రస్తుతం ఎక్స్ రే, ఎలక్ట్రాన్లను రేడియో థెరపీ కోసం వాడుతున్నారు. అయితే పెన్సిల్వేనియా యూనివర్సిటీ సైంటిస్టులు వీటికి బదులుగా  హై ఎనర్జీ ప్రోటాన్స్​ను వాడారు. దీంతో ఇవి నేరుగా కేన్సర్ ట్యూమర్​లనే నాశనం చేశాయి. ఈ పద్ధతిలో సైడ్​ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ మాత్రమే ఉంటాయని తేలింది. ‘ఫ్లాష్​రేడియోథెరపీ’ విధానం కేన్సర్ ట్రీట్​మెంట్​లో విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుత రేడియేషన్ థెరపీలాగే ఈ కొత్త పద్ధతిలోనూ ఆరోగ్యకరమైన కణాలకు హాని ఉండదని సైంటిస్టులు చెప్తున్నారు. కేన్సర్ టూమర్ల వెనక ఉండే అవయవాలకూ ప్రమాదం కలగదని అంటున్నారు. ఎలక్ట్రాన్లకు బదులుగా ప్రోటాన్లను ఫ్లాష్​డోసెస్​గా వాడటం ఇదే మొదటిసారని యూనివర్సిటీలోని రాబర్ట్స్ ప్రోటాన్ థెరపీ డైరెక్టర్ డాక్టర్ జేమ్స్ మెట్జ్ వెల్లడించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2018లో 1.7 కోట్ల కొత్త కేన్సర్ కేసులు నమోదయ్యాయట. ప్రతి10 కేసులలో 4 కేసులు లంగ్, బ్రెస్ట్, బోవెల్, ప్రోస్టేట్ కేన్సర్​లే ఉన్నాయట. ఇక 2040 నాటికి ఏటా 2.75 కోట్ల కొత్త కేన్సర్ కేసులు నమోదవుతాయని రీసెర్చర్లు అంచనా వేశారు.