కేరళతో పాటు కేంద్రంలోనూ మేమే.. కాంగ్రెస్ గెలుపుపై రాహుల్​ గాంధీ ధీమా

కేరళతో పాటు కేంద్రంలోనూ మేమే.. కాంగ్రెస్ గెలుపుపై రాహుల్​ గాంధీ ధీమా
  •     ఆర్ఎస్​ఎస్​ భావజాలంతో  స్వాతంత్ర్యం రాలేదు
  •     ఒకే దేశం, ఒకే భాష, ఒకే లీడర్​అనేది బీజేపీ విధానం
  •     ఎక్కువ మంది లీడర్లు ఎందుకు ఉండకూడదన్న రాహుల్​

వయనాడ్: ఆర్ఎస్ఎస్​ భావజాలంతో దేశానికి స్వాతంత్ర్యం లభించలేదని కాంగ్రెస్​ మాజీ చీఫ్, ఎంపీ  రాహుల్​గాంధీ అన్నారు. ఈ మేరకు సోమవారం కేరళలోని వయనాడ్​లో రాహుల్​ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు తమిళనాడులోని నీలగిరి కాలేజీ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్​ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. సంఘ్ పరివార్​వల్ల, ఆ భావజాలం వల్ల మనకు ఆంగ్లేయులనుంచి స్వేచ్ఛ లభించలేదని చెప్పారు.  ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే నాయకుడు అనేది బీజేపీ, మోదీ ఆలోచన అని, ఇది దేశ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు. ‘దేశంలో ఒకే నాయకుడు ఉండాలా? ఎందుకు ఎక్కువ మంది లీడర్లు ఉండొద్దా? ఇది దేశ యువతను అవమానించినట్టు కాదా?’ అని ప్రశ్నించారు. 

రెండుచోట్లా మాదే అధికారం..

కేరళతోపాటు కేంద్రంలోనూ కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని రాహుల్​గాంధీ ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం అనేది పుష్పగుచ్ఛంలాంటిదని, అన్ని పువ్వులకు సమగౌరవం దక్కాలని, అది మొత్తం పుష్పగుచ్ఛానికే అందమని పేర్కొన్నారు. భాషపై ఎవరూ నిషేధం విధించలేరని, అది మనుషుల హృదయాంతరాళంలోనుంచి వస్తుందని తెలిపారు. మలయాళం ఒక భాష మాత్రమే కాదని.. అది కేరళ రాష్ట్ర నాగరికత అని పేర్కొన్నారు. దేశ ప్రజల మాట వినాలని, వారి భాష, మతం, సంస్కృతిని ప్రేమించాలని కాంగ్రెస్​ కోరుకుంటున్నదని చెప్పారు. 

కానీ బీజేపీ మాత్రం తమ ఆలోచనలనే ప్రజలపై రుద్దాలని చూస్తుందని దుయ్యబట్టారు. వయనాడ్ ​నియోజకవర్గంలోని కొన్నిచోట్ల అడవి జంతువులు మనుషులపై దాడి చేస్తుండడం పరిపాటిగా మారిందని, ఇలాంటి సమస్యల వల్ల రాత్రిపూట ప్రయాణాలపై బ్యాన్ పెడుతున్నారని రాహుల్​ చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటూ కేరళ సీఎం విజయన్ కు తాను చాలాసార్లు లేఖలు రాశానని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ తమ పార్టీ అధికారంలో లేకపోవడమే ఈ నిర్లక్ష్యానికి కారణమని ఆరోపించారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నీలంబర్​ రైల్వే సమస్యను కూడా సులభంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

పేదల కోసం బీజేపీ మేనిఫెస్టోలో ఏముంది..

బీజేపీ ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో పేదలకోసం ఏమీలేదని, కానీ 2036 ఒలింపిక్స్​ కోసం బిడ్డింగ్ గురించి మాట్లాడుతున్నారని రాహుల్​గాంధీ దుయ్యబట్టారు. తాలూరు కళాశాల స్టూడెంట్లతో ఆయన మాట్లాడారు. ‘యువత, మహిళలతోపాటు అన్ని వర్గాల కోసం ఏంచేస్తామో మా మేనిఫెస్టోలో పెట్టాం. కానీ బీజేపీ మాత్రం 2036 ఒలింపిక్స్​ గురించి ఆలోచిస్తోంది. ఇది బీజేపీకి, కాంగ్రెస్​కు ఉన్న తేడా’ అని పేర్కొన్నారు.