'భారత్​ జోడో' , 'భారత్​ తోడో' మధ్య యుద్ధం ఇది.. : రాహుల్​గాంధీ

'భారత్​ జోడో' , 'భారత్​ తోడో' మధ్య యుద్ధం ఇది.. : రాహుల్​గాంధీ

కాంగ్రెస్​ పార్టీ దేశ ప్రజలను కలుపుతూ, ప్రేమను పంచుతూ భారత్​జోడో చేస్తుంటే.. బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని.. రానున్న ఎన్నికలు రెండు విభిన్న భావాలు కలిగిన పార్టీల మధ్య యుద్ధంగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అభివర్ణించారు.  పట్నాలో విపక్ష పార్టీల కీలక సమావేశం జరుగుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రజల్లో చీలిక తెచ్చి, హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. దాన్ని కాంగ్రెస్​ ప్రేమతోనే ఎదుర్కుంటుందని.. అది కర్ణాటకలో ఎంతటి ఫలితాన్ని ఇచ్చిందో రుజువైందని అన్నారు.

కలిసి పని చేస్తాం..

బిహార్​ రాజధాని పట్నాలోని సీఎం నితీష్ కుమార్​తో జూన్​ 23న ప్రతిపక్షాల సమావేశం జరుగుతోంది. తామంతా కలిసి రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ని ఓడిస్తామని రా.గా. అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్​ నేతల కలిసికట్టు పోరాటం బీజేపీని ఓడించేలా చేసిందని వివరించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్​ఘడ్​, మధ్యప్రదేశ్ లలో బీజేపీ ఏ మాత్రం లేదని.. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
ఇక రానున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని మ‌ట్టిక‌రిపించేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాల‌ను రూపొందించేందుకు నితీష్ కుమార్ నివాసంలో విప‌క్ష నేత‌ల స‌మావేశం ప్రారంభ‌మైంది.

ఈ స‌మావేశానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, శివ‌సేన నేత‌లు ఆదిత్య ఠాక్రే, సంజ‌య్ రౌత్ స‌హా ప‌లువురు విప‌క్ష నేత‌లు హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌, ఎన్సీపీ, శివ‌సేన‌, డీఎంకే, జేఎంఎం, ఎస్‌పీ, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జేడీ నేత‌లు పాల్గొన్నారు.