కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారు

కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారు

న్యూఢిల్లీ: కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారని మోడీ సర్కారుపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. చమురు ధరలు భగ్గుమంటుంటే ఫకీరు (మోడీ)ని ప్రశ్నించినా తప్పేనన్నారు. జోలె పట్టుకుని మాయమాటలతో దేశాన్ని దోచుకునేందుకు బయల్దేరారంటూ దుయ్యబట్టారు. ఆసియాలోని పలు దేశాల పెట్రో రేట్లు, భారత్ లో ఉన్న చమురు ధరలను పోల్చుతూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు. ‘పెట్రోల్ రేట్లను భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. అఫ్గానిస్థాన్ లో రూ.66.99, పాకిస్థాన్ లో రూ.62.38, శ్రీలంకలో రూ.72.96, బంగ్లాదేశ్ లో రూ.78.53, భూటాన్ లో రూ.86.28, నేపాల్ లో రూ.97.05, ఇండియాలో రూ.101.81గా ఉంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల నుంచి భారత్ కు విముక్తి కలగాలని #MehangaiMuktBharat అనే హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ కు జత చేశారు. 

ఇకపోతే, పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు ప్రదర్శన చేపట్టారు. ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ అనే పేరుతో నిరసనలకు దిగారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసనగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంటులో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయన్నారు.

మరిన్ని వార్తల కోసం:

ఈ స్థాయిలో రిజర్వేషన్.. రాజ్యాంగ విరుద్ధం

‘రతన్ టాటాకు భారతరత్న’ పిల్ ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు

అక్రమంగా కట్టిన రేప్ కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత