దేశంలో ఓట్ల దొంగలు!.. ఐదు రకాలుగా ఓట్ల చోరీ: రాహుల్ గాంధీ

 దేశంలో ఓట్ల దొంగలు!.. ఐదు రకాలుగా ఓట్ల చోరీ: రాహుల్ గాంధీ
  • బెంగళూరు సెంట్రల్ లోక్​సభ సెగ్మెంట్​లో భారీగా గోల్​మాల్
  • మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 నకిలీ ఓట్లు 
  • ఓటర్ల జాబితాలో లొసుగులు బయటపెట్టిన ప్రతిపక్ష నేత
  • అధికార బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్లను దొంగిలించిందని ఆరోపణ
  • ఆధారాలు సమర్పించాలని రాహుల్​ను​ కోరిన కర్నాటక ఎన్నికల సంఘం
  • రాహుల్​ వ్యాఖ్యలు నిరాధారం: బీజేపీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని, పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం.. అధికార బీజేపీతో కుమ్మక్కై ఓట్లను దొంగిలించిందన్నారు. ఐదు రకాలుగా ఈ ఓట్ల చోరీ జరుగుతోందని ఆయన తెలిపారు. డూప్లికేట్ ​ఓట్లు, ఫేక్​అడ్రస్, ఒకే అడ్రస్​లో భారీగా ఓట్లు, ఇన్​వాలీడ్​ ఫొటోలు, ఫాం- 6 దుర్వినియోగం తదితర కారణాలతో ఈ వ్యవహారం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. 2024 లోక్‌‌సభ ఎన్నికల సమయంలో కర్నాటకలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌‌లోని ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగినట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన మీడియాకు వివరించారు.  2024 లోక్‌‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ సెగ్మెంట్​లోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 నకిలీ ఓట్లు ఉన్నాయని రాహుల్​ తెలిపారు.  

ఈ సెగ్మెంట్‌‌లో 11,965 మంది నకిలీ ఓటర్లు, 40,009 మంది నకిలీ, ఫేక్​అడ్రస్​లతో ఉన్న ఓటర్లు, 10,452 మంది సింగిల్ అడ్రస్ ఓటర్లు, 4,132 మంది చెల్లని ఫొటోలు ఉన్న ఓటర్లు, 33,692 మంది ఓటర్లు కొత్త ఓటర్ల ఫాం 6ను దుర్వినియోగం చేశారని రాహుల్​ ఆరోపించారు.  తమ వద్ద ఉన్న డేటా అంతా 2024 ఎన్నికలకు సంబంధించినదని, ఆ డేటాను ఎన్నికల కమిషన్  నుంచి సేకరించామని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు.  మహారాష్ట్రలో జనరల్ ఎలక్షన్​ తర్వాత ఫలితాలు చూసినప్పుడే ఏదో తప్పు జరిగిందని తమకు అనుమానం కలిగిందని రాహుల్​ తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎన్నికలు కూడా ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. అక్కడ ఎగ్జిట్​ పోల్స్​కు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో 30 సీట్లు గెలిచిన ఇండియా కూటమి.. ఐదు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50 మార్కు కూడా దాటలేకపోయింది. మహారాష్ట్రలో ఐదు నెలల్లో 40 లక్షల ఓటర్లు నమోదయ్యారని..  ఐదేండ్లలో నమోదయ్యేవారి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఐదు నెలల్లో నమోదయ్యారని రాహుల్ తెలిపారు. ఆ సమయంలో ఎన్నికల సంఘం డిజిటల్ ఓటరు జాబితాలను తనిఖీ చేయడానికి ఇచ్చేందుకు నిరాకరించిందని ఆయన ఆరోపించారు.

దేశ ప్రజలను రాహుల్ అవమానించారు: బీజేపీ 

బీజేపీ ఎన్నికల విజయాన్ని మోసంగా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ దేశ ప్రజలను అవమానించారని ఆ పార్టీ మండిపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. అధికారం లేకపోవడంతో  రాహుల్ గాంధీ పూర్తిగా మనోనియంత్రణ కోల్పోయారని అన్నారు. భావజాలపరంగా ఖాళీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాంగ సంస్థలపై వ్యవస్థీకృతంగా దాడి చేస్తోందని విమర్శించారు. దీని వెనక కుట్ర లేదని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా మాట్లారని విమర్శించారు. పరిమితులను దాటి ఎన్నికల కమిషన్‌‌ పై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. “నరేంద్ర మోదీ 2015 నుంచి ఎన్నికల్లో గెలుస్తున్నారు. రాహుల్ గాంధీ దానిని మోసం అని పిలుస్తున్నారు.  మోదీ పని, నిజాయతీ, ఆయన నాయకత్వంలో దేశ పురోగతికి ఓటు వేసిన దేశ ప్రజలను ఆయన అవమానిస్తున్నారు” అని రవిశంకర్ ప్రసాద్  అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌‌కు ప్రజలు అధికారం ఇవ్వకపోవడంతో రాహుల్​ గాంధీ నిరాశ, కోపంతో ఎన్నికల సంఘంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 

దొంగ ఓట్లపై ఆధారాలివ్వండి: కర్నాటక ఎన్నికల సంఘం

రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాతుండగా.. కర్నాటక చీఫ్​ ఎలక్టోరల్​ఆఫీసర్​(సీఈవో) స్పందించారు. ఓటరు జాబితాలో తప్పుగా చేర్చిన, తొలగించిన ఓటర్ల పేర్లను అందజేయాలని సూచించారు. అలాగే,  రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని రూల్ 20(3)(బి) కింద అఫిడవిట్​ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా.. రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గంలో ఓటరు కాదని, ఈ విషయంలో  స్వచ్ఛందంగా ఈ వివరాలు ఇస్తున్నట్టు పేర్కొనాలని కోరారు. డిక్లరేషన్​లో తప్పుడు సమాచారం ఇస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్, 1950లోని సెక్షన్ 31, భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 227 కింద శిక్షార్హమని హెచ్చరించారు. కాగా, కర్నాటక సీఈవో ప్రకటనపై రాహుల్​ స్పందించారు. తాను  ఒక రాజకీయ నాయకుడినని, ఆ వ్యాఖ్య లు బహిరంగంగా చేశానని, దానిని అఫిడవిట్​గా తీసుకోవచ్చని అన్నారు. "నేను చూపించిన ఓటర్ల జాబితాలు తప్పు అని మీరు చెప్పలేదు. రాహుల్ గాంధీ ప్రమాణం చేసి చెప్పాలని చెబుతున్నారు.. వారికి నిజం తెలుసు. మీరు (ఈసీ) దేశవ్యాప్తంగా ఇలా చేశారని మాకు తెలుసు" అని రాహుల్​గాంధీ అన్నారు.