పుట్టగానే తనను ఎత్తుకున్ననర్సు రాజమ్మతో రాహుల్

పుట్టగానే తనను ఎత్తుకున్ననర్సు రాజమ్మతో రాహుల్

తిరువంబాడి(కేరళ):కేరళ పర్యటనలో రాహుల్​గాంధీ ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించి, ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. క్షేమ సమచారాలు విచారిస్తూ ఆమె అందించిన కానుకలను స్వీకరించారు. ఆమె.. రాజమ్మ వవథిల్. సరిగ్గా 49 ఏళ్ల క్రితం హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో రాహుల్​గాంధీ జన్మించినపుడు డ్యూటీలో ఉన్నది ట్రైనీ నర్స్ రాజమ్మే.. పుట్టిన కాసేపటికి రాహుల్​ను ఎత్తుకున్న కొద్దిమందిలో రాజమ్మ కూడా ఒకరు. నర్స్​గా ఆర్మీకి సేవలందించిన రాజమ్మ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి,  కుటుంబంతో కేరళలో సెటిలయ్యారు. ఇటీవల రాహుల్​పౌరసత్వంపై వివాదం రేగడంతో.. ఆయన ఢిల్లీలోని ఆస్పత్రిలో జన్మించారనడానికి తానే సాక్ష్యమని రాజమ్మ చెప్పారు. తాజాగా రాహుల్​ వయనాడ్​పర్యటనకు రాగా..  కుటుంబంతో వెళ్లి రాహుల్​ను కలుసుకున్నారు. పొత్తిళ్లలో చూసిన పసికందును మళ్లీ ఇన్నాళ్లకు ప్రత్యక్షంగా చూడడంతో రాజమ్మ భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్​కోసం స్వయంగా చేసి తీసుకొచ్చిన స్వీట్లు, చిప్స్​ను ఆయనకందించారు.

బీజేపీది సవతి తల్లి ప్రేమ

బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని కాంగ్రెస్​చీఫ్​రాహుల్​గాంధీ ఆరోపించారు. ఆయన దృష్టిలో కేరళ ఎన్నటికీ ఉత్తరప్రదేశ్​కాలేదని చెప్పారు. వయనాడ్​పర్యటనలో భాగంగా మూడో రోజు రాహుల్​కోజికోడ్​లో రోడ్​షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంగప్పూజ ప్రాంతంలో రాహుల్​మాట్లాడుతూ..  కోపం, విద్వేషాలతో బీజేపీ కళ్లు మూసుకుపోయాయని ఆరోపించారు.  ఆరెస్సెస్​భావజాలాన్ని పాటించని వారు ఇండియన్లే కాదన్నట్లుగా ప్రవర్తిస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలా, నాన్​బీజేపీ పాలిత రాష్ట్రాలను మరొకలా ట్రీట్​చేస్తున్నారని ప్రధానిపై విమర్శలు గుప్పించారు. వారణాసి లాగే కేరళ పైనా తనకు అభిమానం ఉందన్న ప్రధాని వ్యాఖ్యలను రాహుల్​కొట్టిపారేశారు. ప్రధాని దృష్టిలో యూపీ వేరు, కేరళ వేరన్నారు. కేరళ సీపీఎం పాలనలో ఉండడం వల్ల వయనాడ్​అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ తనకు సహకరిస్తారనే ఆశలేదని రాహుల్​ చెప్పారు. సీపీఎం, కాంగ్రెస్ ల మధ్య సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నా వాటన్నిటినీ పక్కనపెట్టి వయనాడ్​అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం సీపీఎం కల్పెట ఎమ్మెల్యేతో భేటీ అయిన విషయాన్ని రాహుల్​గుర్తుచేశారు. తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ఇతర సమస్యలను కూడా పార్లమెంట్​లో ప్రస్తావిస్తానని కేరళ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.

రాహుల్​వి నీడ్​యూ..

రాష్ట్రంలో రాహుల్​రోడ్​షో కు స్థానికుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. మహిళలు, పిల్లలు, యువతతో పాటు పార్టీ కార్యకర్తలు వందలాదిగా రోడ్​షోలో పాల్గొన్నారు. దారి పొడవునా రాహుల్​ జిందాబాద్ అన్న నినాదాలు మార్మోగాయి. యువత ‘రాహుల్.. వి నీడ్​యూ’, ‘రాహుల్​పాడా(ఆర్మీ)’ అనే స్లోగన్లు రాసున్న టీ షర్టులు వేసుకుని రోడ్​షోలో పాల్గొన్నారు.