రాహుల్ న్యాయ్ యాత్ర ఆలస్యం..ఢిల్లీలోనే ఏఐసీసీ ముఖ్యనేతలు

రాహుల్ న్యాయ్ యాత్ర ఆలస్యం..ఢిల్లీలోనే ఏఐసీసీ ముఖ్యనేతలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపటనున్న భారత్ జోడో యాత్ర ఆలస్యంగా ప్రారంభంకానుంది. దట్టమైన పొగమంచు కారణంగా యాత్ర ఆలస్యం కానుంది. మణిపూర్ వెళ్లాల్సిన నేతలంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రయంలోనే ఉన్నారు.   పొగ మంచు కారణంగా ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో నేతలంతా విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు.

న్యాయ్ యాత్రకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు వెళ్లారు. ఏపీ నుంచి వైఎస్ షర్మిల, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘవీర రెడ్డి వెళ్లారు. న్యాయ్ యాత్ర మణిపూర్​లో ఒక్కరోజు సాగుతుంది. ఆ తర్వాత నాగాలాండ్​లో రెండ్రోజుల పాటు 5 జిల్లాల్లో 257 కిలోమీటర్లు.. అస్సాంలో 8 రోజుల పాటు 17 జిల్లాల్లో 833 కిలోమీటర్లు ఉంటుంది. అనంతరం అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్కో రోజు చొప్పున యాత్ర సాగుతుంది. 

ఇక వరుసగా బెంగాల్​లో 5 రోజుల పాటు 7 జిల్లాల్లో 523 కిలోమీటర్లు.. బిహార్​లో 4 రోజుల పాటు 7 జిల్లాల్లో 425 కిలోమీటర్లు.. జార్ఖండ్​లో 8 రోజుల పాటు 13 జిల్లాల్లో 804 కిలోమీటర్లు.. ఒడిశాలో 4 రోజుల పాటు 4 జిల్లాల్లో 341 కిలోమీటర్లు.. చత్తీస్ గఢ్​లో 5 రోజుల పాటు 7 జిల్లాల్లో 536 కిలోమీటర్లు.. యూపీలో 11 రోజుల పాటు 20 జిల్లాల్లో 1,074 కిలోమీటర్లు.. మధ్యప్రదేశ్​లో వారం పాటు 9 జిల్లాల్లో 698 కిలోమీటర్లు సాగుతుంది. చివరగా రాజస్థాన్​లో ఒక రోజు, గుజరాత్, మహారాష్ట్రలో 5 రోజుల చొప్పున ఉంటుంది. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్ర ముగుస్తుంది. కాగా, ఈ యాత్ర అత్యధికంగా యూపీ​లో 11 రోజుల పాటు 1,074 కిలోమీటర్లు సాగుతుంది.