చైనా ఆక్రమణ  నిజమే: రాహుల్

చైనా ఆక్రమణ  నిజమే: రాహుల్

కార్గిల్: బార్డర్ ఇష్యూ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. లడఖ్​లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు. కానీ, ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదంటూ ప్రధాని మోదీ అబద్ధం చెప్పారని మండిపడ్డారు. లడఖ్ టూర్​కు వెళ్లిన రాహుల్.. శుక్రవారం చివరి రోజు కార్గిల్ లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్​లో మాట్లాడారు. ‘‘నేను బైక్ పై లడఖ్ మొత్తం తిరిగాను. పాంగాంగ్ లేక్ దగ్గరికి వెళ్లినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది.  వేలాది కిలోమీటర్ల మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. కానీ, ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించుకోలేదని ప్రధాని మోదీ అబద్ధం చెప్పారు” అని రాహుల్ ఫైర్ అయ్యారు. మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న విషయం లడఖ్​లోని ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు. 

కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం.. 

అత్యధిక వనరులు ఉన్న లడఖ్​ను తన కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. ‘‘మీ భూమిని లాక్కొని అదానీకి అప్పగించాలని బీజేపీ చూస్తోంది. అందుకే రాజకీయంగా మిమ్మల్ని అణచివేస్తోంది’’ అని అన్నారు. ‘‘రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఉద్యోగాలు కల్పించాలని, లేహ్, కార్గిల్ జిల్లాలకు రెండు వేర్వేరు లోక్ సభ నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని లడఖ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ (కేడీఏ) పోరాటం చేస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ మద్దతు ఉంటుంది. పార్లమెంట్ లో లడఖ్ ప్రజల సమస్యలను ప్రస్తావిస్తాను” అని చెప్పారు. మోదీ ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాం​ను ప్రస్తావిస్తూ.. ‘‘కొంతమంది తన మదిలో ఏముందో మాట్లాడతారు. కానీ నేను మీ మదిలో ఏముందో తెలుసుకోవడానికి వచ్చాను” అని అన్నారు.