
- ఇది రేపటి దేశ జనగణనకు బెంచ్ మార్క్: రాహుల్ గాంధీ
- తెలంగాణ ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉన్నదని ట్వీట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక కులగణనను చూసి తాను గర్వపడ్తున్నానని, ఈ సర్వే దేశవ్యాప్త జనగణన ప్రక్రియకు బెంచ్‌మార్క్ లాంటిదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా పాత్ర.. అక్కడి ప్రజలు, వారి భాష, సంస్కృతితో మాకు లోతైన భావోద్వేగ బంధం ఏర్పడింది.
నీతి, నిజాయితీ, అందరినీ కలుపుకుపోయేతత్వం ఉన్న అక్కడి మను షులు, సంప్రదింపుల ప్రక్రియ పట్ల వారికి ఉన్న నిబద్ధ త దేశానికి మార్గనిర్దేశం చేసింది. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కులగణన చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషిని చూసి నేను గర్వపడ్తున్నా. ఈ కులగణన ఆధారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో 42% ఓబీసీ రిజర్వేషన్లను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మ క అడుగులు వేసింది.
ఈ బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి వద్ద ఉన్నది’’అని రాహుల్ పేర్కొన్నారు. కాగా, రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాటలు సామాజిక న్యాయ లక్ష్యాలను పూర్తిగా సాధించే వరకు అన్ని అడ్డంకులను ఎదుర్కొని పోరాడటానికి తనకు స్ఫూర్తినిస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.