
గుడిహత్నూర్, వెలుగు: గిరిజనులుగా కొనసాగుతున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్, ఉమ్రి(బి) రాయిసెంటర్ల ఆదివాసీలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు మండలంలోని మాన్కాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు. ఏండ్లతరబడి జిల్లాలోని ఏజెన్సీలో చట్ట విరుద్ధంగా ఎస్టీలుగా కొనసాగుతూ అసలైన ఆదివాసీలకు అందే ప్రభుత్వ ఫలాలను అనుభవిస్తున్న లంబాడాలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, వారికి ఎస్టీ ధ్రువపత్రాలు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు.
వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం మాన్కాపూర్ నుంచి పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు.
సమావేశంలో మాన్కాపూర్, ఉమ్రి (బి) రాయిసెంటర్ల సార్‌మేడీలు పెందూర్ జైరాం, కాత్లే భరత్, మండల రాజ్‌గోండ్ సేవా సమితి గౌరవాధ్యక్షుడు కోవ భగవాన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఉయిక లక్ష్మణ్, అధ్యక్షుడు కోవ జలపత్, కార్యదర్శి తొడసం మహేశ్, ఆదివాసీ నాయకులు రాము పటేల్, అడ సంతోష్, మడావి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.