ఫుడ్‌, గ్రోసరీ స్టోర్స్‌ తెరవాలి..లేకపోతే ప్రజలకే కష్టం

ఫుడ్‌, గ్రోసరీ స్టోర్స్‌ తెరవాలి..లేకపోతే ప్రజలకే కష్టం

ముంబై ఫుడ్‌, గ్రోసరీ స్టోర్స్‌ను తెరిచి ఉంచేందుకు అనుమతివ్వాల్సిందిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) కోరుతోంది. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఫుడ్‌, గ్రోసరీ స్టోర్ల ఉద్యోగులను, డెలివరీ స్టాఫ్‌ను కొట్టడంతోపాటు, పోలీసు స్టేషన్‌లకు తీసుకెళ్లిన నేపథ్యంలో  ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆర్‌ఏఐ తెలిపింది. ప్రజలు బయటకు రాకుండా చూసేందుకు హోమ్‌ డెలివరీ మెకానిజం సాయపడుతుందని, కాబట్టి దానిని అనుమతించాలని కోరింది. ఫుడ్‌, గ్రోసరీ స్టోర్స్‌ చిన్నవైనా, పెద్దవైనా సరే తెరిచి ఉంచేలా చూడాలని పిలుపు ఇచ్చింది. నిత్యావసర వస్తువులు అమ్మే గ్రోసరీ స్టోర్స్‌ను మూసివేయడం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని, అందుకే తెరచి ఉంచడానికి అంగీకరించాయని వెల్లడించింది. వాటిని మూసివేస్తే ప్రజలు ఒకేసారి ఎక్కువ సరుకులు కొంటారని, తద్వారా కొరత ఏర్పడుతుందని కూడా పేర్కొంది. ప్రజలకు సేవలు అందించేందుకు రిటైల్‌ రంగంలోని ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెడుతున్నారని తెలిపింది.

ప్రజలకు నిత్యావసర వస్తువులు యధావిధిగా దొరికేలా  వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరినట్లు రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. మాల్స్‌, రిటైల్‌ స్టోర్స్‌ మూసివేస్తే అవన్నీ నష్టాలపాలయి, దివాలా బాట పడతాయని తెలిపింది. ఈ మాల్స్‌, స్టోర్స్‌లలో పనిచేసే లక్షలాది మంది ఉపాథి కోల్పోయి, కష్టాలలో పడతారని కూడా పేర్కొంది. పీఎంఓ, కామర్స్‌ మినిస్ట్రీ, ఫైనాన్స్‌ మినిస్ట్రీలకు తమ సమస్యలను విన్నవించినట్లు తెలిపింది. తమకు స్టిమ్యులస్‌ ప్యాకేజ్‌ కావాలని ఎస్‌బీఐ, ఆర్‌బీఐలను కోరినట్లు పేర్కొంది. కన్సంప్షన్‌ పెరిగేలా చూసేందుకు తమకు ఈ స్టిమ్యులస్‌ ప్యాకేజ్‌ ఇవ్వాలని కోరుతన్నట్లు వివరించింది. అప్పుల చెల్లింపుపై మూడు నెలల మారటోరియంతోపాటు, వేతనాలు, విద్యుత్‌ బిల్లులపై సబ్సిడీ ఇవ్వాలని, అడ్వాన్స్‌ ట్యాక్స్‌, జీఎస్‌టీ వంటి స్టాట్యుటరీ చెల్లింపులకు జూన్‌ దాకా గడువు పొడిగించాలని కూడా ఆర్‌ఏఐ కోరుతోంది.