
- ఆఫీసులు, ఇండ్లలో రాష్ట్ర జీఎస్టీ ఆఫీసర్ల సోదాలు
- 8 గంటలపాటు 25 టీమ్స్‌తో 150 మంది తనిఖీలు
- హార్డ్ డిస్క్‌లు, సీపీయూలు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్‌గా రాష్ట్ర జీఎస్టీ ఆఫీసర్లు దాడులు చేశారు. రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్‌రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ సంస్థ, సుశీ చంద్రగుప్త కోల్ మైన్, సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్ కంపెనీల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని హెడ్ ఆఫీస్‌తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇండ్లల్లోనూ సోదాలు చేశారు. మొత్తం 25 టీమ్స్‌తో దాదాపు 150 మంది జీఎస్టీ ఆఫీసర్లు ఈ దాడుల్లో పాల్గొన్నారు. 8 గంటల పాటు సాగిన రెయిడ్స్‌లో హార్డ్ డిస్క్‌లు, సీపీయూలు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
దాడులు కొనసాగినంత సేపు బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను బయటకు వెళ్లనివ్వలేదు. వారి దగ్గర ఉన్న మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాడులు చేయడానికి ముందు ఉదయం నాంపల్లి కమిషనర్ ఆఫీసులో కమర్షియల్ టాక్స్ కమిషనర్ నీతు ప్రసాద్, 5 డివిజన్లకు సంబంధించిన జీఎస్టీ అధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాతే అంతా కలిసి సుశీ ఇన్ ఫ్రా కంపెనీల్లో తనిఖీలు చేశారు. బంజారాహిల్స్‌లోని ఆఫీసులో చేసిన సోదాల్లో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లతో పాటు 20 మంది సిబ్బంది పాల్గొన్నారు. స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తూ.. సుశీ ఇన్ ఫ్రాపై జీఎస్టీ ఆఫీసర్లు దాడులు చేసినట్లు తెలుస్తున్నది. అయితే దాడులకు సంబంధించిన సమాచారాన్ని కమర్షియల్ టాక్స్ఆఫీసర్లు రహస్యంగా ఉంచారు. సోదాలు మంగళవారం కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.