న్యూఢిల్లీ: వరుస రైలు అగ్నిప్రమాదాల నేపథ్యంలో భారతీయ రైల్వే బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదాలు అనుకోకుండా జరిగినవి కాదని సంఘ విద్రోహ శక్తులు కావాలని చేసిన కుట్రల ఫలితమని స్పష్టం చేసింది.
రాజస్తాన్‌లోని అమర్పురా స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు దుప్పట్లు, బెడ్షీట్లకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడని, దీనివల్ల అక్కడ మంటలు చెలరేగాయని తెలిపింది. మే 19న మిథిల వైపు వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని అక్కడ జనరల్ బోగీ బాత్రూమ్లో దట్టమైన పొగలు రావడాన్ని గమనించారని పేర్కొంది. తర్వాత దర్యాప్తు చేయగా పెట్రోల్‌తో తడిపిన క్లాత్లభ్యమైందని తెలిపింది.
కోటాలో జరిగిన ఘటనలో కూడా తొలుత రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బాత్రూమ్లోనే మంటలు చెలరేగినట్లు తేలిందని పేర్కొంది. మే17న మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరగ్గా 68 మంది ప్రయాణికులు ఉన్న బోగీని 15 నిమిషాల్లో ఖాళీ చేయించామని వెల్లడించింది.
ఇదిలా ఉండగా ససారం స్టేషన్లో విద్యుత్ జనరేటర్లు ఏవీ పనిచేయని సమయంలో ఖాళీ బోగీల్లో మంటలు చెలరేగాయని, ఎవరో కాలుతున్న వస్తువును ఆ ఖాళీ కంపార్ట్మెంట్లోకి విసరడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు రైల్వే శాఖ తెలియజేసింది.
