పెద్దపల్లిలో వేగంగా రైల్వే ప్రాజెక్టు పనులు..లోక్ సభలో ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

పెద్దపల్లిలో వేగంగా  రైల్వే ప్రాజెక్టు పనులు..లోక్ సభలో ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
  • లోక్‌‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్‌‌ నియోజకవర్గంలో డబ్లింగ్, ఆధునీకరణ, కార్గో టెర్మినల్స్, డిజిటల్‌‌ టికెటింగ్‌‌ వంటి రైల్వే ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధానంగా కాజీపేట-, బల్హర్షాకు సంబంధించి భవిష్యత్తులో నాలుగో లైన్‌‌ కోసం కూడా సర్వే జరుగుతోందని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం లోక్‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాజీపేట-, బల్హర్షా మూడో లైన్‌‌ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. 202 కిలోమీటర్ల మూడో లైన్, విద్యుదీకరణ పనులు రూ.2,063 కోట్లతో చేపట్టామని చెప్పారు. ఇందులో 177 కిలోమీటర్లు పూర్తయినట్లు వెల్లడించారు. 

ఈ ప్రాజెక్టు కోసం 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.186 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, పెద్దపల్లి-, నిజామాబాద్‌‌ ప్రాజెక్టు 178 కిలోమీటర్ల డబ్లింగ్‌‌ పనుల కోసం సర్వే జరుగుతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. సింగరేణి గనుల బొగ్గు తరలింపు కోసం పార్థసారథిపురం, బెల్లంపల్లి, భద్రాచలంలో గతి శక్తి కార్గో టెర్మినల్స్‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పార్థసారథిపురంలో గతిశక్తి కార్గో టెర్మినల్‌‌ పూర్తయిందన్నారు. పెద్దపల్లితో పాటు తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లు అమృత్‌‌ భారత్‌‌ పథకం కింద అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. ఈ పథకం కింద పెద్దపల్లిలో ప్లాట్‌‌ఫారమ్‌‌ షెల్టర్, టాయిలెట్లు నిర్మించగా, స్టేషన్‌‌ భవనం, పార్కింగ్‌‌ ఏరియా, ఫుట్‌‌ ఓవర్‌‌ బ్రిడ్జి(ఎఫ్‌‌వోబీ), దివ్యాంగుల సౌకర్యాలు వంటి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.