మానుకోటకు రైల్వే పీవోహెచ్‌‌‌‌.. 300 ఎకరాల్లో వరంగల్‌‌‌‌ – మహబూబాబాద్‌‌‌‌ రూట్‌‌‌‌లో ఏర్పాటుకు రైల్వే శాఖ ఉత్తర్వులు

మానుకోటకు రైల్వే పీవోహెచ్‌‌‌‌.. 300 ఎకరాల్లో వరంగల్‌‌‌‌ – మహబూబాబాద్‌‌‌‌ రూట్‌‌‌‌లో ఏర్పాటుకు రైల్వే శాఖ ఉత్తర్వులు
  • 300 ఎకరాల్లో ఏర్పాటు, రూ. 908.15 కోట్లు మంజూరు 
  •  ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉపాధి

మహబూబాబాద్, వెలుగు :
 ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాకు మరో ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్‌‌‌‌ మంజూరు అయింది. ఇప్పటికే కాజీపేట వద్ద కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు సాగుతుండగా.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటిసారిగా ఏర్పాటు చేయనున్న పీవోహెచ్‌‌‌‌ (పీరియాడికల్‌‌‌‌ ఓవరాలింగ్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌) సైతం ఉమ్మడి జిల్లాకే దక్కింది. వరంగల్‌‌‌‌ – మహబూబాబాద్‌‌‌‌ రూట్‌‌‌‌లో రైల్వే ట్రాక్‌‌‌‌ పక్కనే వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో ఇక్కడే ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణానికి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చిన రైల్వే శాఖ, అందుకు అవసరమైన నిధులను సైతం మంజూరు చేసింది. 

రూ. 908.15 కోట్లతో.. 300 ఎకరాల్లో ఏర్పాటు

మహబూబాబాద్‌‌‌‌ సమీపంలో రైల్వే మెయింటెనెన్స్‌‌‌‌ పీరియాడికల్‌‌‌‌ ఓవరాలింగ్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం రెండేండ్ల నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ ఏర్పాటు కోసం మొత్తం 300 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని అంచనా వేశారు. దీంతో మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌‌‌‌ పక్కనే ఉన్న 500 ఎకరాల ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వివరాలు, జిల్లాలో పీవోహెచ్‌‌‌‌ ఏర్పాటుకు అనువైన పరిస్థితులతో రూపొందించిన నివేదికను జిల్లాకు చెందిన వివిధ సంఘాల నాయకులు, రైల్వే ఉద్యోగులు గతంలో మహబూబాబాద్‌‌‌‌ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్‌‌‌‌, జాతీయ ఎస్టీ కమిషన్‌‌‌‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌‌‌‌నాయక్‌‌‌‌కు అందించారు. 

వారు పలుమార్లు రైల్వే ఉన్నతాధికారును కలిసి మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో పీవోహెచ్‌‌‌‌ ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. స్పందించిన రైల్వే ఆఫీసర్లు సమగ్ర సర్వే నిర్వహించి పీవోహెచ్‌‌‌‌ ఏర్పాటుకు మహబూబాబాద్‌‌‌‌ జిల్లా అనువైనదిగా గుర్తించారు. దీంతో మెగా మెయింటెనెన్స్‌‌‌‌ డిపో, పీవోహెచ్‌‌‌‌, ఆర్‌‌‌‌వోహెచ్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణానికి రూ. 908.15 కోట్లు మంజూరు చేస్తూ రైల్వే డిప్యూటీ సీఎంఈ స్వరాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి 

మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్న పీవోహెచ్‌‌‌‌లో రైళ్లకు సంబంధించిన అన్ని రకాల రిపేర్లతో పాటు మూడు నెలలకు ఒకసారి ఇంజిన్‌‌‌‌, బోగీలకు నిర్వహించే రెగ్యులర్‌‌‌‌ చెకప్‌‌‌‌లు జరగనున్నాయి. జిల్లాలో పీవోహెచ్‌‌‌‌ నిర్మాణ పనులు పూర్తి అయితే ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. 

వివిధ రాష్ట్రాలకు చెందిన టెక్నీషియన్లు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో మానుకోట రైల్వే స్టేషన్‌‌‌‌ ప్రధానమైన సెంటర్‌‌‌‌గా మారనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ – చెన్నై, భువనేశ్వర్ – ముంబై, హైదరాబాద్ – విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లే 300లకు రైళ్లు మానుకోట స్టేషన్‌‌‌‌ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి 

పీవోహెచ్‌‌‌‌ ఏర్పాటు హర్షణీయం

మహబూబాబాద్‌‌‌‌ జిల్లాకు అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్‌‌‌‌ దక్కడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి అయితే వేలాది మందికి ఉపాధి దొరకడంతో పాటు, మహబూబాబాద్‌‌‌‌ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ రావడానికి కృషి చేసిన రైల్వే ఆఫీసర్లు, రాజకీయ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
  – యుగంధర్ యాదవ్, రైల్వే మజ్దూర్‌‌‌‌ యూనియన్‌‌‌‌ వరంగల్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ కార్యదర్శి