రైల్వే ప్రయాణం ప్రమాదరహితం కావాలి

రైల్వే ప్రయాణం ప్రమాదరహితం కావాలి

 పశ్చిమ బెంగాల్‌‌లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగినది డౌన్ కాంచన్‌‌జంగా ఎక్స్‌‌ప్రెస్‌‌ను గూడ్స్ రైలు వెనుక నుండి ఢీకొట్టడంతో చాలా మంది మరణించినారు భద్రతా ప్రమాణాల పట్ల సరియైన శ్రద్ధ చిత్తశుద్ధి కనపరచడం లేదనటానికి  ఈ ప్రమాదం ఒక నిదర్శనం. దీనికి సంబంధించిన అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

గూడ్స్ రైలు నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో నడపడానికి ఎందుకు అనుమతించబడినది? అసలు రెండు రైళ్లు ఒకే ట్రాక్‌‌పై వెళ్ళటానికి బాధ్యులు ఎవరు?  ఈ సంఘటన మానవ తప్పిదమని దుర్ఘటనకు గూడ్స్‌‌ రైలు డ్రైవర్‌‌ కారణమని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి.  కానీ మానవ తప్పిదం  లేకుండా ఇలాంటి ప్రమాదాలు జరగవు.  లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్‌‌లు  దాదాపు 20000  పోస్టులు సంవత్సరాలుగా ఖాళీలుగా ఉన్నట్టు తెలుస్తున్నది. 

మానవ వనరుల కొరతతో రైలు డ్రైవర్లు  ఎక్కువ షిఫ్టులలో పనిచేయడానికి దారి తీస్తున్నది. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలి.  ఇటువంటి దుర్ఘటనలు మునుముందు ఎట్టి పరిస్థితుల్లో  జరగకుండా ప్రభుత్వం రైల్వే బోర్డు వారు  రైల్వే శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సాంకేతిక నిపుణులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి భద్రతా రక్షణ చర్యల  కోసం కఠినమైన నియమ నిబంధనలు రూపొందించాలి.  వీటిని కఠినంగా అమలుపరచడానికి అవసరమైతే పార్లమెంట్ లో  ఒక చట్టం చేయాలి. 

ప్రమాదాలు నివారించడానికి సూచనలు సలహాలు ప్రజల వద్ద నుండి కూడా  విస్తృతస్థాయిలో స్వీకరించాలి. ఆధునిక అత్యంత సాంకేతికతో వేగంగా నడిచే బుల్లెట్ వందే  భారత్ రైళ్ళతో సమానంగా అదే స్థాయిలో భద్రతతో కూడిన  సురక్షితమైన ప్రయాణం కల్పించినప్పుడే భారత రైల్వే పట్ల ఒక భరోసా కలుగుతుంది.

 దండంరాజు
రాంచందర్ రావు