తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  జూన్  11 నుంచి రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపింది.  ఇవాళ కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆ జిల్లాకు  ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్  జారీ చేసింది.   మిగతా అన్ని జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ALSO READ | కామారెడ్డి జిల్లాలో వర్షబీభత్సం

ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలు  చురుకుగానే ఉన్నాయి.  ఉత్తరాంధ్ర కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం  ఏర్పడింది. జూన్ 10న వాయువ్య ఉత్తర ప్రదేశ్, పరిసరాల నుంచి మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ ఘడ్, మధ్య ఒడిస్సా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగిన ద్రోణి జూన్ 11న  బలహీన పడింది. ఈ క్రమంలోనే  రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది.  

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 

జూన్ 12న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల,  సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్  జారీ చేసింది.