రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు పడే చాన్స్

రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు పడే చాన్స్

తెలంగాణలో మరో రెండు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.  నిన్నటి ఉపరితల  ఆవర్తన ప్రభావంతో ఇవాళ  ఉదయం ఒక అల్పపీడన ప్రదేశం ఉత్తరఅండమాన్  ప్రదేశం  దాని పరిసర ప్రాంతాల్లోని దక్షిణ అండమాన్ & ఆగ్నేయ బంగాళాఖాతంలో  ఏర్పడింది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల  ఆవర్తనము  సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి మీ ఎత్తు వరకు కొనసాగుతోంది.

ఈ అల్పపీడనము  పశ్చిమ వాయువ్యదిశగా  కదులుతూ , 22న  మధ్య బంగాళాఖాతం & పరిసరాలలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తరువాత క్రమంగా బలపడుతూ 23 తేదికి తీవ్రవాయుగుండంగా బలపడి తరువాత దిశను మార్చుకొని ఉత్తర దిశగా కదలి 24వ తేదికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం & పరిసరాలలోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో  తుఫానుగా ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత క్రమంగా  ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఒడిశా  తీరం వెంబడి కదులుతూ  పశ్చిమబెంగాల్ నుంచి బంగ్లాదేశ్ తీరంకి  25న చేరుకునే అవకాశం ఉంది.