వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • మూడు గంటల వానకే 17 కాలనీలు మునక
  • అర్ధరాత్రి నుంచి ఓరుగల్లు వాసుల జాగారం
  • లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరద నీరు
  • నెత్తిన సామానుతో బయటకు వచ్చిన జనాలు 
  • సిటీలో ఎండావానలతో.. డిఫరెంట్‍ వాతావరణం


వరంగల్‍, వెలుగు:గ్రేటర్‍ వరంగల్​లో మంగళవారం అర్ధరాత్రి దాదాపు మూడు గంటలపాటు దంచికొట్టింది. దీంతో వరదనీరు సుమారు 17 కాలనీల్లోకి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షం పడటానికి గంటముందు కూడా వాతావరణంలో పెద్దగా మార్పులు కనిపించనప్పటికీ కుండపోత వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. ఇండ్లలోకి నీరు చేరడంతో సామాన్లు, టీవీలు, మంచాలు మునిగాయి. కాలనీవాసులు పనికొచ్చే సామానును నెత్తిన పెట్టుకుని నీటిలో ఈదుకుంటూ బయటకొచ్చారు. పిల్లలు, మహిళలను లారీ ట్యూబ్‍లపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

పిడుగులతో కాలిపోయిన ఫ్యాన్లు, టీవీలు 
మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు హోరు వానతో గ్రేటర్‍ ప్రాంతాల్లో చాలాచోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో పలువురి ఇండ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు, టీవీలు కాలిపోయాయి. ఇంట్లో ఖరీదైన వస్తువులు కాలడంతో జనాలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అదే సమయంలో కరెంట్‍ పోయింది. బయట వాన, వరద.. ఇంట్లో చీకటితో కాలనీల్లో జనాలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 

వారం నుంచి డిఫరెంట్‍ వెదర్‍ 
గ్రేటర్‍ వరంగల్​లో గత వారం రోజులుగా డిఫరెంట్ వెదర్​ ఉంటోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భగభగమండే ఎండతో సమ్మర్‍ను తలపిస్తుండగా.. వెంటనే వాతావరణం మారి కారుమబ్బులు కమ్మి వాన పడుతోంది. ఆపై మళ్లీ ఎండ కాస్తోంది. రాత్రి పూట సమ్మర్​లో ఉన్న వాతావరణం ఉంటుండటంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 

లోతట్టు ప్రాంతాల్లో మేయర్ పర్యటన
సిటీలో నీటమునిగిన ప్రాంతాల్లో మేయర్​గుండు సుధారాణి పర్యటించారు. సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్‍ నగర్, బృందావన్ కాలనీ, సాయినగర్, మైసయ్య బి.ఆర్.నగర్ ప్రాంతాల్లో తిరిగారు.  వరదల మళ్లింపునకు శాశ్వత చర్యలు తీసుకుంటామని మేయర్​ చెప్పారు. 

  • ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి 
  •  పోలీసులకు బీజేపీ లీడర్ల ఫిర్యాదు 

కమలాపూర్, వెలుగు: హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ లీడర్లు బుధవారం పోలీసు లకు ఫిర్యాదు చేశారు. గత రెండు మూడ్రోజులుగా ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి, ఈటలను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఆ వ్యాఖ్యలు నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కమలాపూర్​బీజేపీ మండలాధ్యక్షులు కట్కూరి అశోక్​రెడ్డి ఆరోపించారు. ఫిర్యాదు చేసినవారిలో మాట్ల రమేశ్, పల్లె వెంకట్​రెడ్డి, వలిగే సాంబారావు, భూపతి ప్రవీణ్, పెండ్యాల ప్రభాకర్​రెడ్డి, జెరుపోతుల రమేశ్, బండి కోటేశ్వర్, తిరుపతి, రాజేశ్​తదితరులు ఉన్నారు.

  • కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన 
  • ప్రారంభించిన సీపీ తరుణ్ జోషి

ఎంజీఎం, వెలుగు: సీనియర్ మెడికల్ స్టూడెంట్లు తమ జూనియర్లతో ఫ్రెండ్లీగా ఉంటూ అవసరమైన సలహాలు ఇవ్వాలని వరంగల్‍ సీపీ డా.తరుణ్‍జోషి సూచించారు. వరంగల్ కేఎంసీలో బుధవారం  యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్ తరుణ్ జోషి చీఫ్​ గెస్ట్​గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కేఎంసీ ఎంతోమంది వైద్యులను తయారు చేసిందన్నారు. అలాంటి కాలేజీలో జూనియర్ స్టూడెంట్స్ ను ర్యాగింగ్​చేయకుండా సీనియర్లు మార్గదర్శకంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపల్ డా.మోహన్‍దాస్‍ పాల్గొన్నారు.


'దళిత బంధు' లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధులు కీలకం

పాలకుర్తి ,  వెలుగు: దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  బుధవారం పాలకుర్తిలోని మంత్రి క్యాంపు ఆఫీసులో దళిత బంధు పథకంపై కార్యకర్తల అవగాహన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి మండలంలో 229 యూనిట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. లబ్ధిదారులు వివిధ రంగాలలో తమకు నచ్చిన యూనిట్స్​ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. దళితుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్‌‌మోడల్‌‌ గా ఉందని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
తొర్రూరు, వెలుగు: పెద్దవంగర మండలం ఉప్పరగూడెంలోని రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనలో బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్​నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. అనంతరం పెద్దవంగరలో ఐసీడీఎస్​ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, రామచంద్రయ్యశర్మ, టీఆర్ఎస్​ లీడర్లు పాల్గొన్నారు.

కెమికల్ తాగిన చిన్నారిని పరామర్శించిన ఆఫీసర్లు
నర్సింహులపేట, వెలుగు: ప్రమాదకర కెమికల్స్అంగన్​వాడీ సెంటర్ లలో ఉంచొద్దని జడ్పీ డిప్యూటీ సీఈవో, ఇన్​చార్జి డీడబ్ల్యూవో నర్మద సిబ్బందిని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం అంగన్​వాడీలో మంగళవారం చిన్నారి తాగునీరు అనుకొని కెమికల్​తాగిన విషయం తెలిసిందే. చిన్నారిని ఇన్​చార్జి డీడబ్ల్యూవో నర్మద పరామర్శించారు. అబ్జర్వేషన్ కోసం చిన్నారిని మహబూబాబాద్ హాస్పిటల్ లో చేర్పించామన్నారు. సిబ్బందిపై ఎంక్వైరీకి ఆదేశించామని రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. 

ఈతకు పోయి ప్రాణం పోగొట్టుకున్నడు
మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్డంపేట వాగులో  దోస్తులతో ఈతకు పోయి ఓ బాలుడు ప్రాణం పోగుట్టుకున్నాడు. స్థానికులు వివరాల ప్రకారం.. మేశినేని అఖిల్(15)  టెన్త్ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం దోస్తులతో కలిసి పెద్దంపేట వాగులో ఈతకు వెళ్లాడు. సుమారు 100 మీటర్ల పొడవున్న వాగులో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈత కొట్టుకుంటూ వెళ్లారు. తిరిగి ఈ  ఒడ్డుకు వస్తుండగా కయ్యలో మునిగిపోయాడు. తోటి పిల్లలు గ్రామస్తులకు విషయం చెప్పడంతో వలల సాయంతో వెతికారు. కయ్యలో బురదలో అఖిల్ ఇరుక్కుపోయి చనిపోయాడు. తండ్రి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు.

అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య
హసన్ పర్తి, వెలుగు: అప్పుల బాధతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఉరేసుకున్నాడు. కేయూ పోలీస్​స్టేషన్​సీఐ దయాకర్ వివరాల ప్రకారం.. కరీంనగర్​జిల్లా ఇల్లంతకుంట మండలం భోగంపాడుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి(45) ప్రస్తుతం కేయూ పోలీస్​స్టేషన్​పరిధిలోని గోపాలపురం దుర్గా కాలనీలో నివాసముంటున్నాడు. సొంతూరులో ఉన్న  భూమిని  అమ్మి వేరోచోట భూమి కొనుగోలు చేశాడు. ఈ విషయంలో కొంత అప్పు అయింది. వాటిని తీర్చలేక మంగళవారం బాత్రూంలో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

కలెక్టరేట్ ​పనులను స్పీడప్​ చేయాలి: కలెక్టర్ కె. శశాంక
మహబూబాబాద్, వెలుగు:  జిల్లా కేంద్రంలో కొత్తకలెక్టరేట్​నిర్మాణ పనులను స్పీడప్ ​చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆఫీసర్లు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​పనుల పురోగతిపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్​లో అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్ బీ ఈఈ తానేశ్వర్, పీఆర్​ఈఈ భూపాల్, డీహెచ్ఎస్ వో సూర్యనారాయణ, ఆర్డీవో కొమురయ్య పాల్గొన్నారు.

కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన 
    
ఎంజీఎం, వెలుగు: సీనియర్ మెడికల్ స్టూడెంట్లు తమ జూనియర్లతో ఫ్రెండ్లీగా ఉంటూ అవసరమైన సలహాలు ఇవ్వాలని వరంగల్‍ సీపీ డా.తరుణ్‍జోషి సూచించారు. వరంగల్ కేఎంసీలో బుధవారం  యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్ తరుణ్ జోషి చీఫ్​ గెస్ట్​గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కేఎంసీ ఎంతోమంది వైద్యులను తయారు చేసిందన్నారు. అలాంటి కాలేజీలో జూనియర్ స్టూడెంట్స్ ను ర్యాగింగ్​చేయకుండా సీనియర్లు మార్గదర్శకంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపల్ డా.మోహన్‍దాస్‍ పాల్గొన్నారు.


ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య
శాయంపేట, వెలుగు: ఆరునెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో జరిగింది. ఎస్సై వీరభద్రరావు వివరాల ప్రకారం.. జయశంకర్‌‌‌‌భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన బాషబోయిన సక్కుబాయి, సంపత్‌‌‌‌ కుమార్తె సృజన(26)ను శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన బగ్గి సుధాకర్‌‌‌‌కు ఇచ్చి ఆరేళ్ల కింద పెండ్లి చేశారు. వీరికి 4 ఏండ్ల కూతురు ఉంది.  రెండో కాన్పులో కడుపులో బిడ్డ తిరిగే క్రమంలో నొప్పులు, వాంతులు, విరేచనాలు తట్టుకోలేక సృజన మంగళవారం ఇంట్లో దూలానికి ఉరేసుకుంది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా సృజన అప్పటికే చనిపోయింది. మృతురాలి తల్లి సక్కుబాయి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మరోవైపు భార్యభర్తల మధ్య గొడవల వల్లే సృజన ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. 

కరెంట్​ షాక్​తో మహిళ మృతి
మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: వ్యవసాయ పనులు చేస్తుండగా కరెంట్​వైరు మీద పడి మహిళా కూలి చనిపోయింది. ఎస్ఐ తమాషా రెడ్డి వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపురం(వి) గ్రామానికి చెందిన కర్రె కోమల(40) బుధవారం గుమ్మడవెల్లి శివారులోని పొలంలో నాటు వేస్తుండగా కరెంట్​వైరు తెగి ఆమె మీద పడి షాక్​కొట్టింది. తోటి కూలీలు సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి కరెంట్​సప్లై నిలిపివేయించారు. 108 వాహనంలో చిట్యాల సివిల్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​దే గెలుపు
హసన్ పర్తి, వెలుగు:  రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వర్ధన్నపేట కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరంగల్ 66వ డివిజన్ లో టీఆర్ఎస్, బీజేపీల నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి నాయిని రాజేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు కడప కిరణ్, నన్నం శెట్టి స్వామి పాల్గొన్నారు.

గోరికొత్తపల్లిని మండలం చెయ్యాలె
రేగొండ, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గోరికొత్తపల్లిని మండలం చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపయ్య మాట్లాడుతూ గోరికొత్తపల్లిని మండలంగా ప్రకటించేదాకా పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చొరవ తీసుకుని మండల ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, లీడర్లు ప్రసాద్​రావు, లింగారెడ్డి, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
 

భూమి పైకి లేచిన దేవాదుల పైపులైన్  

ధర్మసాగర్, వెలుగు:  హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామంలో దేవాదుల పైప్ లైన్  భూమిలో నుంచి పైకి లేచింది. దీంతో గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో భూమి లోపలి నుంచి రెండు పైప్ లైన్ లు వేశారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పైప్ లైన్ మొత్తం పైకి లేచింది. ఒక పైప్ లో నుంచి నీళ్లు లీక్ కాగా.. పైకి లేచిన పైప్ లో నీరు లేకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. నాణ్యతా లోపంతో పైపులైన్ పైకి లేచిందని గ్రామస్తులు అంటున్నారు.

గురుకులంలో బోరు ప్రారంభం 
మహబూబాబాద్​ అర్భన్, వెలుగు: గురుకుల స్కూళ్లలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ స్కూల్​ను ఇటీవల సందర్శించిన టైంలో స్టూడెంట్స్​తాగునీటి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు బుధవారం బోరు వేయించి మోటారు బిగించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​ లీడర్లు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, కేఎస్ఎన్​ రెడ్డి, వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.