గ్రేటర్ హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం

గ్రేటర్ హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం

గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం మళ్లీ  మొదలైంది. బలమైన గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద నీటితో పలు కాలనీలు, బస్తీల్లో ఉండే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లపై నిలిచిన వరద నీరు అలానే ఉంది. సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం భారీగా వర్షం కురుస్తోంది. 

దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు జోరుగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ట్వీట్ చేసింది. 45 నిమిషాల తర్వాత గంట, రెండు గంటల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. జంట జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

తార్నాక, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ షుక్ నగర్, లిబర్టీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, ఆఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. మరోవైపు.. సంగారెడ్డి, పటాన్ చెరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.