చెడగొట్టు వానలతో పంటలు ఆగం.. తెలంగాణగా అనేక చోట్ల దంచికొట్టిన వానలు

చెడగొట్టు వానలతో పంటలు ఆగం.. తెలంగాణగా అనేక చోట్ల దంచికొట్టిన వానలు
  • కొనుగోలు సెంటర్ల దగ్గర తడిసిన వడ్లు-  
  • వనపర్తిలో తడిసిన 2వేల ధాన్యం బస్తాలు
  • హైదరాబాద్​లో కూల్​గా మారిన వాతావరణం
  • మరో 5 రోజులు వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ 

నెట్ వర్క్/హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షం దంచికొట్టింది. వర్షాల వల్ల హైదరాబాద్ సిటీ కూల్ అయిపోగా, పల్లెల్లో పంటలు మాత్రం ఆగమయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి పంటలు నేలవాలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కల్లాల్లో ఉన్న వడ్లు, కొనుగోలు సెంటర్లకు తెచ్చిన ధాన్యం తడిసిపోయి రైతులు గోసపడ్డారు.

ఈదురు గాలులకు అనేక చోట్ల కరెంట్​పోల్స్ పడిపోయాయి. భారీ చెట్లు కూడా నేలకొరిగాయి. మరోవైపు వర్షాల వల్ల హైదరాబాద్​లోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్​లతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పట్టి అనేక చోట్ల చిరుజల్లులతో మొదలైన వర్షం.. అర్ధరాత్రి దాటే సరికి జోరందుకుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. 

దీంతో ఆయా జిల్లాల్లో కోతకు వచ్చిన పంటలు నేలకొరిగాయి. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నిజామాబాద్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో వడగండ్ల వానలు పడ్డాయి. 

 వనపర్తిలో తడిసిన 2 వేల బస్తాల ధాన్యం 

వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం రాత్రి పడిన వర్షానికి వడ్లు తడిసిపోయాయి. అర్ధరాత్రి సమయంలో వాన పడడంతో యార్డు ఆవరణలో ఉన్న 2 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పలు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. నంగునూరు మండలం రాజగోపాలపేటలో తాటిచెట్టుపై పిడుగు పడింది. సిద్దిపేట, చిన్నకోడూరు, దుబ్బాక వ్యవసాయ మార్కెట్లలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల వరి, మొక్క జొన్న పంటలు నేల వాలగా.. మరికొన్ని చోట్ల మామిడి కాయలు రాలిపోయాయి. 

హనుమకొండలో రైతుల అవస్థలు 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, హసన్ పర్తి మండలాల్లో శనివారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకుని వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎల్కతుర్తి మండలం చింతలపల్లి, గోపాలపూర్, కోతులనడుమ, సూరారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వర్షం కారణంగా కాంటాలు నిలిచిపోయాయి. సెంటర్లలో ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకునేందుకు రైతులు శ్రమించారు. కమలాపూర్ మండలం గూడూరులోని కొనుగోలు కేంద్రానికి చిల్లులు పడిన బార్దాన్ సరఫరా చేయడంతో అన్నదాతలు అవస్థలు పడ్డారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే కోతలు జోరందుకోగా, చెడగొట్టు వానలు మోపవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

జనగామలో భారీగా తడిసిన ధాన్యం 

జనగామ జిల్లా జఫర్ గఢ్, నర్మెట్ట, బచ్చన్నపేట మండలాల్లో శనివారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడిసింది. నర్మెట్ట మండలం బొమ్మకూరుతోపాటు జఫర్ గఢ్, చిల్పూరు మండలాలు, స్టేషన్ ఘణపూర్ మండలం కునూరు పల్లగుట్ట, తిమ్మంపేట, ఉప్పుగల్లు, తమ్మడపల్లె గ్రామాల్లో భారీ స్థాయిలో ధాన్యం తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కునూరులో అత్యధికంగా 4.2 సెంటీమీటర్లు, తాటికొండలో 3.7, నర్మెట్టలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లాలో శనివారం చినుకులు కురిశాయి. శుక్రవారం కురిసిన వానకు 65 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 

నిజామాబాద్​లో కూలిన కరెంట్ పోల్స్ 

నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో నాలుగు సార్లు చెడగొట్టు వానలు, రాళ్లవానలు పడ్డాయి. శుక్రవారం రాత్రి బోధన్ సెగ్మెంట్ లోని రెంజల్ మండలంలో కురిసిన వర్షంతో కళ్లాల మీద ఉన్న వడ్లు తడిసిపోయాయి. వడ్లు కాంటా చేసి లారీల్లో ఎక్కించిన బస్తాలు మొత్తం తడవడంతో మిల్లర్లు ఇబ్బందిపడ్డారు. మంధర్నా, హున్సా గ్రామాల్లో మామిడి చెట్ల కాయలు రాలిపోయాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో కోతకు రెడీగా ఉన్న వరి పంట నేలకొరిగింది. మాక్లూర్, నందిపేట, డిచ్​పల్లి, ఇందల్వాయి, నవీపేట మండలాల్లో 907 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలతో కూడిన వర్షం వల్ల జిల్లాలో116 కరెంట్ పోల్స్ పడిపోయి, సప్లైపై ఎఫెక్ట్ పడింది. పది చోట్ల ట్రాన్స్​ఫారాలు కూడా పడిపోయాయి. కరెంట్ పోల్స్, ట్రాన్స్ ఫారాలకు సంబంధించి రూ.16 లక్షల నష్టం జరిగినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్​రావు తెలిపారు. 

సల్లవడ్డ పట్నం 

హైదరాబాద్​లో శనివారం ఉదయం వర్షం దంచికొట్టింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, బహదూర్​పుర, షేక్ పేట్, బండ్లగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, ఆసిఫ్ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచే  మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వాన జల్లులకు నగరం కాస్త కూల్ అయింది.

ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం లభించింది. సిటీలో ఒక్కసారిగా వర్షం కురవడంతో జనానికి ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. చెట్లు విరిగి పడ్డాయని, నీరు నిలిచిందని రెండు గంటల్లోనే జీహెచ్ఎంసీకి నగర వాసుల నుంచి 31 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, నగరంలో మరో మూడు రోజులు (ఆది, సోమ, మంగళ) భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

కామారెడ్డిలో 15 వేల ఎకరాల్లో పంట నష్టం..  

కామారెడ్డి జిల్లాలో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మాచారెడ్డి మండలంలో కురిసిన వడగండ్ల వానకు వరి పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో వడ్లు తడిసిపోయాయి. ఆకాశం మబ్బులు పట్టి ఉండటంతో వరి పంట కోయాలా? వద్దా? అని రైతులు సందిగ్ధంలో పడ్డారు. జిల్లాలో నెల రోజుల్లోనే ఐదు సార్లు వడగండ్ల వానలు పడ్డాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 15 వేల ఎకరాల వరకు వరి, మక్క, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 

మరో 5 రోజులు వానలు 

రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్​లో హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

శనివారం అత్యధికంగా జనగామ జిల్లా నర్మెట్టలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా జాఫర్​గఢ్​లో 4.5, స్టేషన్​ఘణపూర్ లో​ 4.1, సిద్దిపేట జిల్లా మద్దూర్​లో 3.3, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 2.8, రాజేంద్రనగర్​లో 2.3, సిద్దిపేట్​లో 2.2, బహదూర్​పురలో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.