సిద్దిపేట జిల్లాలో ఊపందుకున్న వరి నాట్లు .. పంటలకు జీవం పోసిన వానలు

సిద్దిపేట జిల్లాలో ఊపందుకున్న వరి నాట్లు .. పంటలకు జీవం పోసిన వానలు
  • అన్నదాతల్లో చిగురించిన ఆశలు
  • పెరుగుతున్న పంటల సాగు

సిద్దిపేట, వెలుగు: జిల్లాలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. మొన్నటిదాకా సరైన వానలు లేక ఆందోళన చెందిన రైతులకు ఊరట లభించింది. ఈ సీజన్ లో ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. ఈ నాలుగు రోజుల పాటు పడ్డ వానలు వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రాణం పోయగా.. సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. వానాకాలం సీజన్ లో 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 

అదును మీద వర్షాలు కురియకపోవడంతో గత వారం వరకు నాలుగో వంతు కూడ పంటలు సాగు కాలేదు. ఈ సీజన్ లో జిల్లాలో 3.65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 1.50 లక్షల ఎకరాల్లో వరి వేశారు. పత్తి 1.20 లక్షల ఎకరాలకు గాను 90వేలు, మొక్కజొన్న 30 వేలకు గాను 20 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ వానలతో వరి నాట్లు జోరందుకున్నాయి. మిగతా పంటలు కూడా సాగు చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. ముందుగా వేసుకున్న అంచనా మేరకు సాగు విస్తీర్ణం చేరుతుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. 

పెరగనున్న కూరగాయల సాగు

వారం రోజుల కిందటి వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. నాలుగు రోజుల పాటు కురిసిన వానలతో సగటుకన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 271.9 మిల్లీ మీటర్లు కాగా.. ప్రస్తుతం 333.9 మిల్లీ మీటర్ల వానలు కురిశాయి. సగటు కన్నా ఇది 28.2 మిల్లీ మీటర్లు ఎక్కువ. జిల్లాలోని 26 మండలాలకు గాను 17 మండలాల్లో సాధారణ, మూడింట్లో ఎక్కువ, 6 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 

మరో రెండు నెలల పాటు ఆశించిన వర్షాలు కురిస్తే పంటలకు ఢోకా ఉండదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, కందులకు ఇటీవల కురిసిన వర్షాలు జీవం పోయగా.. కూరగాయలు, పెసర్లు, స్వీట్ కార్న్, మినుముల సాగు కూడా పెరుగుతోంది. కూరగాయల పంటల సాగు పెరగానికి ఈ వర్షాలు బాగా పనికి వస్తాయని రైతులు చెప్తున్నారు. 

నానో యూరియా వాడకంపై ప్రచారం

నానో యూరియా పర్యావరణానికి మేలు చేస్తుందని, ఈ యూరియాను వాడాలని వ్యవసాయ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సీజన్ లో జిల్లాకు 35,150 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు దాదాపు 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. యూరియాకు కొరత ఉంటుందన్న ప్రచారంతో రైతులు అవసరానికన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో నానో యూరియా వాడకాన్ని పెంచాలని భావిస్తున్నారు.

 ఎకరానికి 3, 4 బస్తాల యూరియా వాడడం వల్ల ఖర్చు పెరుగుతుందని, దాని బదులు అర లీటర్ నానో యూరియా సరిపోతుందని, దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. నానో యూరియాతో నేల ఆరోగ్యం బాగుంటుందని, తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుందని ఆఫీసర్లు అవగాహన 
కల్పిస్తున్నారు. 

నారు ముదిరిపోతుందని భయపడ్డా

 అదునుకు వానలు పడలేదని బాధ పడుతున్న సమయంలో ఇటీవల కురిసిన వర్షాలు వరి పంట వేసినోళ్ల ఆశలు పెంచాయి. నారు పోసి నెల అయినా వర్షాలు పడక నారు ముదిరిపోతుందని భయపడ్డాం. నాకున్న రెండెకరాల పొలంలో పది వేలు ఖర్చు చేసి పోసిన నారును వానలు కాపాడాయి. తర్వాత కూడా అదును మీద వర్షాలు పడితే వరి పంట చేతికి అందుతుంది. 

బుచ్చయ్య, రైతు, కూరెళ్ల

ప్రస్తుతం జిల్లాలో సాగవుతున్న పంటల వివరాలు

వరి    1.51 లక్షల ఎకరాలు
పత్తి    1.05 లక్షల ఎకరాలు
మొక్కజొన్న    25,445 ఎకరాలు
కందులు    5,490 ఎకరాలు
సన్ ఫ్లవర్    3,540 ఎకరాలు