వర్షాలపై ముందే హెచ్చరికలున్నా పట్టించుకోలే: రేవంత్​

వర్షాలపై ముందే హెచ్చరికలున్నా పట్టించుకోలే: రేవంత్​
  • తండ్రీకొడుకులకు..  ప్రజల ప్రాణాలంటే లెక్కేలేదు
  • వర్షాలపై ముందే హెచ్చరికలున్నా పట్టించుకోలే: రేవంత్​
  • ముందస్తు సమీక్ష చేయలే
  • ప్రగతిభవన్​ను చిల్లర రాజకీయాలకు వేదిక చేశారు
  • బీఆర్ఎస్​ నేతల చెరువుల కబ్జాలతోనే కాలనీల మునక

హైదరాబాద్, వెలుగు:అత్యంత భారీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలపై కనీసం ముందస్తు సమీక్ష చేయని సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్​ను చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. శనివారం తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో వరద పరిస్థితిని తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. ప్రజలను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం సచ్చిపోయిందన్నారు. తొమ్మిదేండ్లుగా వరదలు రావడం.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం అల వాటుగా మారిపోయిందని విమర్శించారు. వరదలకు 30 మంది చనిపోయినా వారి కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.

మూడు వేల కోట్ల ఆస్తి నష్టం
రాష్ట్రంలో వరదల వల్ల 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనాలున్నాయని రేవంత్ అన్నారు. ఇప్పటిదాకా రూ.3 వేల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు. పంట నష్టం తీవ్రంగా ఉన్న ప్రతి ఎకరాకీ రూ.30 వేలు, ఇసుక మేటలతో నిండిన సాగు భూములకు రూ.20 వేల సాయం అందించాలని డిమాండ్​ చేశారు. వరదల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయారని, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. వరదల్లో నష్టపోయిన వారికి తాత్కాలిక సాయం కింద రూ.15 వేలు ఇవ్వాలన్నారు. ప్రజల ప్రాణాలు పూచిక పుల్లతో సమానం అన్నట్టుగా తండ్రీకొడుకులు వ్యవహరించారని మండిపడ్డారు. హైదరాబాద్​సిటీ పరిస్థితి మేడిపండు చందంగా ఉందన్నారు.

వరదసాయంపై అమిత్ ​షాను కలుస్తం
సిటీలో చెరువులను 90 శాతం మంది బీఆర్​ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని రేవంత్​ ఆరోపించారు. దీంతో కాలనీలన్నీ వరదల్లో మునిగిపోయాయన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్​లో చేరారన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి.. దానిని పట్టించుకోకుండా నియోజకవర్గ ప్రజలను మూసీలో ముంచేశారని ఆరోపించారు. వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి సాయం తీసుకురావాల్సిన కిషన్ రెడ్డి.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. వరదసాయంపై కాంగ్రెస్​ ఎంపీలందరం కేంద్ర హోంమత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. 

ఎలివేటెడ్ కారిడార్ పనులెక్కడ 
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను రేవంత్​రెడ్డి పరిశీలించారు. సోమవారంలోగా కారి డార్​ పనుల్లో కదలిక రావాలని, లేదంటే సోమ వారం పార్లమెంట్​లో నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. కారిడార్ పనులు ఎందుకు లేటవుతున్నాయని అధికారులను ప్రశ్నించారు. శాఖల మధ్య సమన్వయం లేకనే పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. పనుల సాగదీతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నాగోల్​లోని మమతా నగర్​ కాలనీలో అసంపూర్తిగా ఉన్న నాలా పనులపైనా రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలను తవ్వి వదిలేశారని, కాలనీ ప్రజలకు ప్రమాదకరంగా మారిందన్నారు.