- జలదిగ్భంధంలో ఉమ్మడి వరంగల్  జిల్లా
 
వెలుగు నెట్ వర్క్  : భారీ వర్షాలు పడుతుండడంతో ఉమ్మడి వరంగల్  జిల్లా జలదిగ్భంధమైంది. వాగులు ఉధృతంగా పారుతుండడం, చెరువులు మత్తడి పోస్తుండడంతో వరద నీరంతా కాలనీల్లోకి, హైవేలపైకి చేరుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- గ్రేటర్  వరంగల్  పరిధిలో 150 నుంచి 160 కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. వరంగల్  తూర్పు పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వడ్డేపల్లి, గోపాల్ పూర్  చెరువుల నుంచి వచ్చిన వరద 40 నుంచి 50 కాలనీల్లోకి వచ్చింది. గురువారం కేయూసీ రోడ్డులోని పెగడపల్లి డబ్బాల వద్ద మెయిన్  రోడ్డు వరకు వరద చేరుకోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు ఎక్కువగా ఉండే నయీంనగర్, కిషన్ పుర ఏరియాల్లో స్టూడెంట్లు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు రాలేని వారంతా సాయం చేయాలని వాట్సాప్  మెసేజ్ లు, ఫోన్ల ద్వారా ఆఫీసర్లను వేడుకున్నారు. ఓ వైపు వరద, మరోవైపు కరెంట్  సరఫరా నిలిచిపోవడంతో గ్రేటర్  ప్రజలు నిద్రాహారాలకు దూరం అయ్యారు.
 - భారీ వర్షం పడడంతో హనుమకొండ జిల్లా పరకాల మండలంలో 45.9 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షం పడింది. దామరచెరువు, నల్లచెరువు మత్తడి పోస్తుండడం, చలివాగు ఉధృతంగా పారుతుండడంతో భూపాలపల్లి, హుజురాబాద్  మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దామరచెరువు నీటితో శ్రీనివాస కాలనీ, మాదారం కాలనీ నీట మునిగాయి. ఓ ఇంట్లోకి వరద చేరడంతో పోలీసులు నలుగురిని కాపాడారు. శంభునిపల్లిలోని సర్కార్  స్కూల్ , కమలాపూర్  బస్టాండ్ , 11వ వార్డు పూర్తిగా జలమయం అయ్యాయి. పోలీస్  క్వార్టర్స్ లోకి నీరు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉప్పల్  సబ్ స్టేషన్ , బీసీ కాలనీ ప్రజలను ఖాళీ చేయించారు. ఉప్పల్ శివారులో వరద నీటిలో చిక్కుకున్న మహిళను పోలీసులు మంచంపై తీసుకొచ్చి రక్షించారు. ఎల్కతుర్తి సోషల్  వెల్ఫేర్  రెసిడెన్షియల్  స్కూల్ , కస్తూర్బా స్కూల్  నీట మునగడంతో 600 మంది చిక్కుకుపోయారు. ట్రైనీ ఐపీఎస్  అంకిత్ , ఎస్సై రాజ్ కుమార్  స్పందించి ట్రాక్టర్ల సాయంతో వారిని కాపాడారు. ధర్మసాగర్  నార్త్  కెనాల్  5 గేట్లు ఎత్తి నీటిని వదిలారు.
 - మహబూబాబాద్  జిల్లాలో ఆకేరు, మున్నేరు, పాలేరు, రాళ్లవాగు ఉధృతంగా పారుతున్నాయి. ఆకేరు వాగు ఉధృతంగా పారుతుండడంతో మరిపెడ మండలం తండ ధర్మారం శివారు సీతారాంతండాకు చెందిన 50 మందిని పునరావస కేంద్రానికి తరలించారు. పొగుళ్లపల్లి సమీపంలో వాగుకు అడ్డుగా పెట్టిన జీపీ ట్రాక్టర్  వరదలో కొట్టుకుపోయింది.
 - జోరు వానకు జనగామ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. జనగామలోని బాలాజీనగర్, జ్యోతినగర్, శ్రీనగర్  కాలనీ, సెయింట్  మేరీస్  స్కూల్ ఏరియాల్లో నీరు నిలిచింది. లక్ష్మీభాయి కుంటలో పలు ఇండ్లలోకి నీరు చేరింది. జనగామ శివారు పెంబర్తి వద్ద ఉన్న జిల్లా రవాణా శాఖ ఆఫీస్  నీటమునిగింది.ఘన్ పూర్ లోని ఎస్సీ, ఈసీ, పాత బరోడా బ్యాంక్  కాలనీలు జలమయం అయ్యాయి.
 - జయశంకర్   భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో రికార్డ్  స్థాయిలో 62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. చెరువులు, కుంటలు అలుగు పోస్తుండడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి వద్ద లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
 
ALSO READ :ముంచెత్తిన వాన.. నిజామాబాద్ సిటీలోని సుమారు 20 కాలనీలు జలమయం
