విశ్లేషణ: ఎప్పుడూ లేనిది సంక్రాంతి టైమ్లో వర్షాలు

విశ్లేషణ: ఎప్పుడూ లేనిది సంక్రాంతి టైమ్లో వర్షాలు


సంక్రాంతి పండుగ టైమ్ లో ఎప్పుడైనా వర్షాలు చూశామా? పంటలు చేతికొచ్చి రైతన్నల లోగిళ్లు, గ్రామాలు కళకళలాడేవి. ఇలాంటి పండుగ సమయాల్లో అదీ జనవరి నెలలో భారీ వర్షాలు పడటం ఆలోచించాల్సిన విషయం. గతంలో ఎండాకాలం అంటే ఎండ, చలికాలం అంటే చలి, వర్షాకాలం అంటే వర్షాలు.. ఉండేవి. ఇప్పుడు ఏ కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. గత మూడు నాలుగు ఏండ్లుగా అకాల వర్షాలతో జనం అల్లాడిపోతున్నారు. వానలు పడాల్సిన టైమ్​లో పడటం లేదు. ఒకవేళ కురిస్తే భారీ వర్షాలు లేదంటే అసలే ఉండటం లేదు. వర్షాకాలంలో పడాల్సిన వానలు ఇతర కాలాల్లో కురుస్తూ.. వరదలతో ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంటే, కార్చిచ్చులు లక్షలాది ఎకరాల అడవులను, వాటిలోని జంతుజాలాన్ని నాశనం చేస్తున్నాయి.

వాతావరణంలో ఈ అనూహ్య మార్పులకు కారణం ఏమిటి? ఎందుకిలా అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వస్తున్నాయనే ప్రశ్నలకు.. అందరి నుంచి వినిపించే సమాధానం ‘గ్లోబల్ వార్మింగ్’. భూమి మీద వాతావరణం సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కుతోంది. ఆ వేడిని చుట్టూ వ్యాపింపజేస్తోంది. ఇదే లేకపోతే భూమి చల్లగా ఉండి అసలు జీవించడానికి పనికొచ్చేది కాదు. అయితే సహజంగా ఉండే ఈ గ్రీన్‌‌హౌస్ ఎఫెక్ట్ కి మనం చేసే పనులు మరింత వేడిని జతచేస్తున్నాయి. ఆధునిక వ్యవసాయం, పారిశ్రామిక కాలుష్యం వల్ల మరిన్ని గ్రీన్‌‌హౌస్ వాయువులు విడుదలై వాతావరణంలో ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సహజంగా ఉంటే సమతౌల్యం చెడదు. కానీ పెట్రోలు ఉత్పత్తుల వాడకం పెంచడంతోపాటు వాటి నుంచి వెలువడే కార్బన్ ​డయాక్సైడ్ ​పీల్చుకునే చెట్లను కొట్టేస్తుండటం వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి.

పారిశ్రామిక విప్లవం తర్వాత గాలిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు 30 శాతం, మీథేన్ వాయువులు140 శాతం పెరిగాయని సైంటిస్టులు చెబుతున్నారు. పైన మండే సూర్యుడు.. కింద చల్లని సముద్రాలు ఉండగా పర్యావరణానికి మనం కలిగించగల నష్టం ఏపాటిదిలే అనుకున్న ప్రజలు దాన్ని లక్ష్యపెట్టలేదు. గనుల్ని తవ్విపోసుకోవడం, పరిశ్రమలను పెట్టి కాలుష్యాలను నదుల్లోకి, గాలిలోకి వదలడం, విద్యుత్తు అవసరాల కోసం బొగ్గును మండించడం, అడవుల్ని కొట్టేయడం, సముద్రాలను చెత్తకుండీలుగా మార్చేయడం ఇలా అన్నీ విధ్వంసక చర్యలు భూమి మీద మనిషి ఎంత ప్రభావం చూపగలడో అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఉష్ణోగ్రతలు పెరిగాయి..
మనిషి బాడీ టెంపరేచర్ ​రెండు డిగ్రీలు పెరిగితేనే తట్టుకోలేడు. అలాంటిది కొంతకాలంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది కానీ, తగ్గడం లేదు. మనిషి చేస్తున్న ప్రకృతి విరుద్ధ పనులే భూమి వేడిని పెంచుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే భవిష్యత్తు ఎలా వుంటుందో ఊహించుకోగలమా? ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ద్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. అక్కడెక్కడో మంచు కరిగితే మనకేంటని అంటారా? అలా కరిగితే ఈ శతాబ్దాంతానికి సముద్ర మట్టం మీటరు వరకు పెరగవచ్చని సైంటిస్టుల అంచనా. అదే జరిగితే మాల్దీవులు, సీషెల్స్ లాంటి ఎన్నో దీవులు మునిగిపోతాయి. వియత్నాం, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో చాలాభాగం మునిగిపోతుంది. అత్యధిక సముద్రతీరం ఉన్న మనదేశంలోనూ తీరప్రాంతాల్లో నివసించేవారు అన్నీ వదులుకొని వలసవెళ్లాల్సిందే. వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్​లో మునిగిపోయే జాబితాలో నెల్లూరు ముందుంటుందని, అలాగే శ్రీకాకుళం లోతట్టు ప్రాంతాలకు, దివిసీమకు ప్రమాదముంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దంలో మనిషి మనుగడకు అన్నిటికన్నా పెద్ద ముప్పు వాతావరణ మార్పుల వల్లే సంభవిస్తుందని తేల్చి చెబుతున్నారు. 
సిటీలు ఆగం.. పంట నష్టం
చెన్నై సిటీ ఐదేండ్లుగా అకాల వర్షాలతో ముంపునకు గురవుతూనే వుంది. నాలుగేండ్ల క్రితం కేరళను కుదిపేసిన వరదలు ఇంకా మరువక ముందే ముంబై, హైదరాబాద్ లాంటి మహా నగరాలు కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతూనే ఉన్నాయి. మొన్న నవంబర్ లో కురిసిన వర్షాలకు తిరుమలతో పాటు రాయలసీమ కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఓవైపు నగరాలకు, పట్టణాలకు ముంపు ఎదురవుతుంటే, అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. దీని వల్ల పండించే రైతు నష్టపోవడంతో పాటు ఆహారధాన్యాల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే కరోనా వల్ల దేశంలో ఎంతోమంది మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లోకి జారిపోయారు.

ఎంతోమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. దీనికి ఈ వరదలు తోడు కావడంతో సామాన్యులకు నిత్యావసర ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. అసలే అత్యధిక జనాభా గల మనదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఎన్నో కుటుంబాలు ఆకలికి అలమటించాల్సి వస్తుంది. వీటన్నింటికి మూలం మాత్రం అభివృద్ధి పేరుతో మనిషి చేస్తున్న విచ్చలవిడితనమే. ప్రభుత్వాలు పారిశ్రామిక కాలుష్యానికి కొంతమేరకైనా కళ్లెం వేయాలి. ప్రతి వ్యక్తి నేనొక్కడిని చేస్తే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వీడి వ్యక్తిగత కర్తవ్యంగా కాలుష్య నియంత్రణకు కనీస నియమాలు పాటించాలి. లేదంటే భావితరం మనల్ని క్షమించదు.  - మోతె రవికాంత్, వ్యవస్థాపక అధ్యక్షుడు, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్.