వానల్లేక మొల్కలుఎండుతున్నయ్.. జూన్​ చివరి దశకు చేరుకున్నా జాడలేని రుతుపవనాలు

వానల్లేక మొల్కలుఎండుతున్నయ్.. జూన్​ చివరి దశకు చేరుకున్నా జాడలేని రుతుపవనాలు
  • 20 రోజుల కింద పత్తి, మక్క, జొన్న, కంది విత్తనాలు వేసుకున్న రైతులు 
  • కొందరు నీళ్ల సౌలత్​లేక ఆశలు వదిలేసుకుంటున్నరు 
  • మరికొందరు బిందెలు, స్ప్రింకర్లతో మొల్కలను కాపాడుకుంటున్నరు

మహబూబ్​నగర్, వెలుగు: జూన్ రెండో వారంలో రావాల్సిన రుతుపవనాలు, మూడో వారంలోనూ జాడలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మొల్కలు ఎండుతున్నయి. కొన్నేండ్లుగా జూన్ రెండోవారం ప్రారంభంలోనే వర్షాలు పడ్తుండడం, ఈ సారి ముందస్తుగా పంటలు సాగుచేయాలని సర్కారు కూడా  చెప్పడంతో రైతులు మృగశిర కార్తె ప్రారంభంలోనే పొడిదుక్కులు చేసుకొని పత్తి, జొన్న, మక్క, కందిలాంటి విత్తనాలు వేసుకున్నరు. కానీ,15 రోజులవుతున్నా వర్షాలు పడకపోవడంతో మొల్కన్నీ ఎండిపోతున్నాయి. పలుచోట్ల మళ్లీ దున్నుతుండగా, కొన్నిచోట్ల మొల్కలను కాపాడుకోవడానికి రైతులు బిందెలు, స్ప్రింక్లర్లతో నేలను తడుపుతున్నారు. మరికొందరు ట్రాక్టర్లపై ట్యాంకులు బిగించి స్ప్రే గన్స్ తో పంట సాళ్లను తడుపుతున్నారు. అయితే, ఎండలు తీవ్రంగా ఉండడంతో మరో రెండురోజుల్లో వర్షాలు రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో మొల్కలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

బిందెలతో నీళ్లు పోస్తున్నరు 

ఈ వానాకాలం సీజన్​లో రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 75 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో మక్క, మరో 5 లక్షల ఎకరాల్లో జొన్న,  కందిలాంటి పంటలు పూర్తిగా వర్షాధారంగా సాగు చేస్తున్నారు. మృగశిర ప్రారంభంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ని 9 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసుకున్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. వర్షాలు పడకపోవడంతో పత్తి మొలకలు ఎండిపోతుండగా, చాలాచోట్ల రైతులు బిందెలతో నీళ్లను తెచ్చికాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల నీళ్లు పట్టలేక చేన్లను దున్నేస్తున్నారు. గండీడ్, మహమ్మదాబాద్, చిన్నచింతకుంట, మహబూబ్​నగర్​రూరల్, వనపర్తి ప్రాంతాల్లో రైతులు మొక్కలకు వేలు ఖర్చు చేసి స్ర్పింక్లర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 20 రోజుల కింద సీడ్ పత్తి కోసం విత్తనాలు వేయగా,  ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కొందరు రైతులు స్ర్పింక్లర్ల ద్వారా బతికించే ప్రయత్నం చేస్తుండగా, ఇంకొందరు గొర్లకు మేతగా వదిలేశారు.

అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి 

మహబూబాబాద్​జిల్లాలో ఇప్పటికే 30 వేల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేయగా, మొల్కలన్నీ ఎండిపోతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో వారం కింద 40 శాతం మంది రైతులు విత్తనాలు వేయగా, మొల్కలు వాడిపోతుండటంతో మొగులు వైపు చూస్తున్నారు. ఆదిలాబాద్​జిల్లా బజార్​హత్నూర్ మండలం గిర్నూరుకు చెందిన రైతు భూమన్న 6 రోజుల కింద ఐదున్నర ఎకరాల్లో ఎనిమిది బ్యాగుల పత్తి విత్తనాలను చల్లాడు. వర్షాలు పడక మూడు రోజుల నుంచి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తూ బతికించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  

బోర్లు బందైనయ్.. చెరువులు ఎండినయ్  

ఏటా జూన్​రెండో వారంలో తొలకరి వర్షాలు ప్రారంభమయ్యేవి. కానీ, ఈ ఏడాది మూడో వారంలోకి ఎంటరవుతున్నా ఎండల ప్రభావం తగ్గడం లేదు. ఎన్నడూ లేనంతంగా ఎండలు దంచి కొడుతుండడంతో వడదెబ్బకు జనం చనిపోతున్నారు. ఏ జిల్లాలో చూసినా 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ఎండల కారణంగా భూగర్భజలాలు వేగంగా పడిపోయి చెరువులు, బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. మహబూబ్​నగర్​జిల్లాలో ఈ ఏడాది జనవరిలో 5.5 మీటర్ల లోతులో ఉన్న నీరు, మే నెలలో 9.1 మీటర్లకు పడిపోయింది. ఇప్పటికే గండీడ్, నవాబ్​పేట మండలాల్లోని కొన్ని ఈగ్రామాల్లో 21 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు పోయడం లేదు. దీనికితోడు గ్రామాలకు ఆదెరువుగా ఉన్న చెరువులు కూడా ఎండిపోతున్నాయి.

మహబూబ్​నగర్​లో 1,455 చెరువులుండగా, వాటిలో సగానికిపైగా చెరువులు అడుగంటాయి. మిడ్జిల్, దేవరకద్ర, చిన్నచింతకుంట, అడ్డాకుల, కౌకుంట్ల మండలాలకు వచ్చే ఎంజీకేఎల్ఐ, కోయిల్​సాగర్, భీమా కాలువలు కూడా వట్టిపోయాయి. ఏప్రిల్ చివరి వారంలో ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీలకు చేరడంతో ఈ కాల్వల ద్వారా సాగునీటి సరఫరాను కూడా బంద్​ చేసి, రెండు నెలలకు పైగానే అయ్యింది.

గ్రామాల్లో కప్పతల్లి ఆటలు

నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యమై వర్షాలు పడకపోవడంతో తెలంగాణ పల్లెల్లో రైతులు, ప్రజలు కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. ఆదివారం మహబూబాబాద్​జిల్లా గూడూరు మండలం జగన్నాయకుల గూడెం శివారు గండితండా ప్రజలు కప్పతల్లి ఆట ఆడారు. రోకలి బండకు పసుపు పూసి, వేపాకులు కట్టి కప్పను వేలాడదీసి భుజాన ఎత్తుకున్నారు. పాటలు పాడుకుంటూ వీధి వీధి తిరిగారు. ప్రజలు, కప్పతల్లికి నీళ్లు పోసి వానలు కురవాలని వాన దేవుడిని మొక్కుకున్నారు. మరికొన్ని చోట్ల కప్పల పెండ్లిళ్ల వంటివి కూడా చేస్తున్నారు.

మహబూబ్​నగర్​రూరల్​మండలం పోతన్​పల్లికి చెందిన అయ్యప్ప, నాగమణి భార్యాభర్తలు. వీరికి ఏడెకరాల పొలం ఉంది. మృగశిర కార్తె ప్రారంభమయ్యాక నాలుగెకరాల్లో పత్తి, రెండెకరాల్లో జొన్న, ఎకరంలో కంది విత్తనాలు వేశారు. దీనికోసం రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పత్తి మొలకలు రాగా, వర్షాలు పడకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. దీంతో బిందెలతో నీళ్లు పోస్తూ మొల్కలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.   

నారాయణపేట జిల్లా, ధన్వాడ మండలం యంనోన్ పల్లికి చెందిన రైతు, మాజీ ఎంపీటీసీ రాధా గౌని శ్రీనివాస్, అనురాధ దంపతులు పది రోజుల కిందట రూ. 30 వేలు ఖర్చు పెట్టి 9 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. విత్తనాలు వేసినప్పుడు పదును తక్కువగా ఉండటం, వారం అవుతున్నా వానలు రాకపోవడంతో పత్తి గింజలు మొలకెత్తలేదు. దీంతో ఇలా ట్రాక్టర్ ఇంజన్​కు 500 లీటర్ల వాటర్ ట్యాంక్​ను బిగించి స్ప్రేగన్స్​తో పత్తి సాళ్లను తడుపుతున్నారు.