చినుకు పడ్తలే..విత్తు మొలుస్తలే

చినుకు పడ్తలే..విత్తు మొలుస్తలే
  • పునాస పంటలకు కష్టకాలం.. రందిపడ్తున్న రైతులు
  • ఇప్పటి దాకా బట్టతడుపు వాన తప్ప గట్టి వర్షం పడలే
  • దుక్కుల్లోనే మాడిపోతున్న పత్తి, మక్క విత్తనాలు
  • మళ్లీ మళ్లీ విత్తుకుంటున్న రైతులు
  • కాల్వల కింద ఇప్పటికీ వరి నార్లు పోయలే
  • పెరుగుతున్న లాగోడి ఖర్చులు
  • తెలంగాణ వచ్చాక తొలిసారి వర్షాభావ పరిస్థితులు

భూపాలపల్లి / నెట్​వర్క్​, వెలుగు:  పునాస సీజన్​ మొదలై నెలదాటుతున్నా ఇంకా రైతులు మొగులు దిక్కు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడక్కడ దుబ్బురు దుబ్బురు.. అదీ బట్టతడుపు వానలే తప్ప ఎక్కడా గట్టి వర్షం పడింది లేదు. చెరువుల్లోకి నీళ్లు వచ్చిందీ లేదు. ఇప్పటికే జోరందుకోవాల్సిన వానలు.. ముఖం చాటేశాయి. మొదట్లో వేసిన పత్తి, మక్క విత్తనాలు నీళ్లు లేక దుక్కుల్లోనే మాడిపోయినయ్​. దీంతో రైతులు మళ్లీ మళ్లీ దున్నుతూ రెండు, మూడుసార్లు విత్తనాలు  వేస్తున్నరు. కానీ వానల్లేక అవి కూడా మొలుస్తయో లేదోనని బుగులుపడ్తున్నరు. అడపాదడపా చిన్నపాటి వానలకు లేసిన మొలకలు కూడా రెండు, మూడు రోజులుగా  పొడి వాతావరణానికి వడలిపోతున్నయ్​.

వరి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. బోర్లు, బావుల కింద ఎట్లనో అట్లజేసి నార్లు పోసుకున్నా.. కాల్వల కింద  ఆయకట్టు ఉన్న రైతులు మాత్రం నీళ్లు లేక ఇప్పటికీ నార్లు పోయలేదు. ముందస్తుగా నారు పోసుకున్న రైతులైతే..ఆ నారు ముదిరిపోతున్నదని బెంగపడ్తున్నరు. ఈసారి ముందస్తు సాగు చేపట్టాలని సర్కారు పిలుపునిస్తే.. తీరా వర్షాలు లేక గతంలో కంటే వెనుకబడాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యవసాయాధికారులు అంటున్నరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  తొలిసారి ఇలాంటి వర్షాభావ పరిస్థితులను చూస్తున్నామని చెప్తున్నరు. 

ఈ వానాకాలం సీజన్‌‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర  ఎకరాల్లో  వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అత్యధికంగా పత్తి 75 లక్షల ఎకరాల్లో, వరి 45 లక్షల ఎకరాల్లో, మక్క 6 లక్షల ఎకరాల్లో, సుమారు 30 లక్షల ఎకరాల్లో మిగిలిన పంటలు  సాగయ్యే చాన్స్​ ఉందని ప్రకటించింది.  ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళను ముందే తాకడంతో ఎప్పట్లాగే రాష్ట్రంలో జూన్​ రెండోవారం నుంచి వర్షాలు ఊపందుకుంటాయని సర్కారు కూడా అంచనా వేసింది. ఏటా వానాకాలంలో పత్తి, వరిలాంటి పంటలు కోత దశలో చెడగొట్టు వానల వల్ల దెబ్బతింటుండడంతో ఈసారి పంట కాలాన్ని నెలరోజులు ముందుకు జరపాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని వ్యవసాయశాఖ ఆఫీసర్లు ప్రచారం కూడా చేశారు. కానీ, వానల జాడలేకపోవడంతో అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. 

లేటయితున్న వరినాట్లు

రాష్ట్రంలో పత్తి తర్వాత అత్యధికంగా సాగయ్యే వరి పంటకు ఇరిగేషన్​ప్రాజెక్టులు, బోర్లు, బావులే దిక్కు. కాగా.. ప్రస్తుతం వర్షాలు, పైనుంచి వరదలు లేకపోవడంతో గోదావరిపై శ్రీరాంసాగర్​, కృష్ణాపై నాగార్జున సాగర్​కూడా డెడ్​స్టోరేజీకి చేరువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాలకు ఆధారంగా ఉన్న 39 వేల చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. 
బోర్లు, బావులు ఉన్న రైతులు ఎలాగోలా వరి నార్లు పోసుకున్నప్పటికీ.. ప్రాజెక్టులు, చెరువుల కింద కాలువ నీటిపై ఆధారపడ్డ రైతులు మాత్రం నార్లు పోసుకునేందుకు వెనుకాడుతున్నారు. కాలువ నీళ్లు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు నార్లు పోసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ముందుగా నార్లు పోసుకున్న రైతులు నీళ్లు లేక నాట్లు వేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయాధికారుల అంచనా ప్రకారమే సుమారు 30 లక్షల ఎకరాల్లో వరి సాగుపై  సందిగ్ధత నెలకొంది.

పత్తిపై తొలి ఎఫెక్ట్​

రాష్ట్రంలో వర్షాధారంగా సాగవుతున్న పత్తిపై తొలి దెబ్బపడింది. రాష్ట్రంలో 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ  అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు రాకముందే రైతులు సుమారు 30 లక్షల ఎకరాల్లో దుక్కిలోనే పత్తి విత్తనాలు వేశారు. మొదట్లో కురిసిన చిన్నచితక వానలకు పత్తి గింజల్లో కొన్ని మొలకెత్తి, మిగతావి ఎండకు మాడిపోయాయి. పత్తి మొక్కలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కూలీల సాయంతో బిందెలతో నీళ్లు పోయిస్తే.. ఇంకొందరు రైతులు స్ప్రింక్లర్లు, డ్రిప్‌‌‌‌ పైపులతో బతికించుకునే ప్రయత్నం చేశారు. బతకని చోట మళ్లీ మళ్లీ దున్ని ఇప్పటికి మూడుసార్లు పత్తి విత్తనాలు వేసిన వాళ్లూ ఉన్నారు. ఈక్రమంలో ఎకరాకు రూ. 10 వేలకు పైగా అదనంగా ఖర్చు చేశామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికి 50 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసినట్లు తెలుస్తుండగా.. మిగిలిన 20 లక్షల నుంచి 25 లక్షల ఎకరాల్లో అసలు విత్తనాలు వేయాలో వద్దో తేల్చుకోలేకపోతున్నారు. 

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్ మండలం తాంసి(-కే) గ్రామానికి చెందిన కూనారపు కిష్టు ఎనిమిది ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసిండు. వానలు లేక సగం విత్తనాలు కూడా మొలకెత్తలేదు. దీంతో రెండోసారి కూడా నాలుగు పత్తి బ్యాగులు తెచ్చి వేసిండు.  కానీ, ఇప్పటికీ వర్షాలు పడకపోవడంతో విత్తులు మొలుస్తయో లేదోనని రందిపడ్తున్నడు. అటు లాగోడీ ఖర్చులు డబుల్​ అయితున్నయనీ, ఆరు ఎకరాల్లో పత్తి విత్తనాలకే రూ. 20 వేల దాకా ఖర్చు అయినయనీ కన్నీళ్లు పెట్టుకుంటున్నడు. 

నారు ముదిరిపోతున్నది

నాకు నాలుగెకరాల పొలం ఉంది. వరి నాటేద్దమని అంతా దున్ని తుకం పోసిన. నారు పెరిగింది. ఇప్పటికే నాట్లు పడేదుండే. వానల్లేక దగ్గర దగ్గర Aనెల రోజులు లేటైంది. నారు ముదిరిపోతున్నది. పొలం దున్నెతందుకు, విత్తనాలకు పది వేల రూపాయల దాక ఖర్చయినై. ఇంకిన్నిరోజులు గిట్లనే వానలు పడకుంటే పరేషానే.  

 బాజ చంద్రం, రైతు, చల్మెడ (మెదక్​ జిల్లా)

పత్తి గింజలు మూడు సార్లు వేసిన

నా పొలంలో ఇప్పటికే మూడుసార్లు విత్తనాలేసినం. వానాకాలం సీజన్‌‌‌‌ మొదట్లోనే మబ్బు మెత్తబడ్డదని, ఎట్లనన్న వాన పడ్తదన్న ఆశతో విత్తనాలు వేసినం. 25 దినాలైనా వానల్లేక దుక్కి నెర్రలు బారింది. రెండెకరాల్లో వేసిన గింజలు కాపాడేందుకు మూడు దినాలు బావి నీళ్లు పారిచ్చినంక కొన్ని మొలకలు ఎల్లినయ్. మిగితయ్​ మాడిపోయినయ్​. కాలం ఎట్లయితదో ఏమో..! 

గూటం మల్లారెడ్డి, రేగొండ రైతు, జయశంకర్‌‌‌‌ జిల్లా

ఎకరంలో మక్క వేస్తే  మొలక రాలే

ఎకరం భూమిలో  20 రోజుల కింద  మక్క విత్తనాలు వేసిన.  వానలు లేక మొలక రాలేదు. ఇప్పుడు దీన్ని దున్నేసి సోయా విత్తనం పెడ్దమనుకుంటున్న. దుక్కి దున్నుడుకి,  విత్తనం, ఎరువులకు ఇప్పటికే రూ. 10 వేల దాక ఖర్చు జేసిన. ఇప్పుడు మళ్లీ దున్నుడు, విత్తనాల ఖర్చు నెత్తినపడ్తున్నది. అదును దాటిన తర్వాత విత్తనాలు వేస్తే  దిగుబడి 
సరిగ్గా రాదు.  

ఏనుగు లింగారెడ్డి,  మర్కల్, కామారెడ్డి జిల్లా