పిల్లలను పెంచడం అంత సులువు కాదు

పిల్లలను పెంచడం అంత సులువు కాదు

ప్రతి ఇంట్లోనూ పిల్లల మధ్య తగవులు మామూలే. కొట్టుకుంటారు... తిట్టుకుంటారు... ఒక్కమాటలో చెప్పాలంటే ఇల్లు పీకి పందిరేస్తారు. ఒక్కోసారి ఈ గొడవలే భవిష్యత్తులో వాళ్ల మధ్య ఒకరిపై మరొకరికి కోపం, ద్వేషం కలిగించడానికి కారణం కావచ్చు. అందుకే పిల్లల పెంపకం అంత సులువు కాదంటున్నారు ఎక్స్​పర్ట్స్​.  అయితే, చీటికిమాటికీ తోడబుట్టిన వాళ్లతో గొడవపడే చిన్నారులను ఎలా సముదాయించాలి? వాళ్ల మధ్య అనుబంధాన్ని ఎలా పెంచాలి అనేవి వివరిస్తున్నారు సైకాలజిస్ట్​, డాక్టర్​ జాజ్​మైన్​ మెకాయ్​. ‘మామ్​ సైకాలజిస్ట్​’గా పేరున్న మెకాయ్..​ పిల్లల పెంపకంపై తన 
ఇన్​స్టాగ్రామ్​ ఖాతా ద్వారా సలహాలు, సూచనలు ఇస్తుంటారు. 

తాజాగా ‘తోడబుట్టిన చిన్నారుల మధ్య తగాదాలు‌‌‌‌ ఎలా తీర్చాలి?’ అనే దాని గురించి తల్లిదండ్రులకు కొన్ని సజెషన్స్​ ఇచ్చారు. అవి..

  •  సాధ్యమైనంతవరకు పిల్లల గొడవల్లో జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ల మధ్య తగాదాకు పెద్ద కారణాలేమీ ఉండవు. అందుకని చూసీచూడనట్లు ఉండాలి.
  •   పిల్లల తగవుకు ముఖ్య కారణాల్లో ఒకటి.. ఎవరో ఒకరు అభద్రత ఫీల్​ కావడం. అలాంటి పిల్లల్ని గుర్తించి వారికి మేమున్నామనే భరోసా ఇవ్వాలి. ఒకరినొకరు కొట్టుకోకుండా చూడాలి.
  •  చిన్నారుల మధ్య తగవును జాగ్రత్తగా గమనించాలి. ఎవరో ఒకరివైపు మాట్లాడకుండా.. వాళ్ల గొడవకు అసలు కారణమేంటో తెలుసుకోవాలి. అందులో తప్పొప్పులు అర్థమయ్యేలా వివరించాలి.
  •   గొడవ తగ్గాక వాళ్ల మధ్య వచ్చిన సమస్య ఎలా పరిష్కరించాలో ఆ పిల్లల్లో పెద్ద వయసు వాళ్లకు నేర్పించాలి. తమ్ముడితోనో, చెల్లెలితోనో తగవును తీర్చుకోవడానికి ఎలా వ్యవహరించాలో  చెప్పాలి. చిన్నవాళ్లు తమకు కావాల్సిన వాటిని పెద్దవాళ్లను అడిగి ఎలా తీసుకోవాలి? వాళ్లను ఎలా గౌరవించాలి? అనేది నేర్చుకోనివ్వాలి.