
నల్గొండ అర్బన్, వెలుగు : ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాసినట్లు అవుతుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా తిప్పర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీల బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆల్మట్టి ఎత్తు పెంచితే, ఇక్కడి పొలాలన్నీ ఎడారిగా మారుతాయని, ప్రభుత్వానికి అడ్డుకోవాలనే సోయి కూడా లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంతసేపు కమీషన్లు, పంపకాలు తప్పితే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రికి సోయి లేదని, మంత్రి కోమటిరెడ్డికి అయితే నీళ్లపై ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండ రైతులతో కలిసి త్వరలో చలో ఆల్మట్టి చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.