రాజాసింగ్ విడుదల పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్

రాజాసింగ్ విడుదల పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుంచి విడుదల కావడం పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. @TigerRajasingh అని క్యాప్షన్ యాడ్ చేసి.. ఓ ఫొటోను ట్విట్టర్‭లో షేర్ చేశారు. ఆ ఫొటోలో రాజాసింగ్‭తో పాటు ఆయన సన్నిహితులు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ జైలు నుంచి విడుదల కావడంతో ఆయన అనుచరులు, అభిమానులు బుధవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. జైశ్రీరామ్ నినాదాలతో గోషామహల్ మార్మోగింది.  

రాజాసింగ్ ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. రాజాసింగ్ విద్వేష ప్రసంగాలతో, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ... గత ఆగస్టు 25న ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జైలులోనే ఉన్న రాజాసింగ్ చివరికి హైకోర్టు తీర్పుతో విడుదలయ్యారు. శ్రీరాముడి ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చానని రాజాసింగ్ అన్నారు. ఇక రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటును కూడా ఎత్తివేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు బీజేపీ నిర్ణయం తీసుకోనుంది.