
రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల గురుకులం, పెద్దూర్‌లోని మహాత్మా జ్యోతి బాపూలే, సిరిసిల్ల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల, తంగళ్లపల్లిలోని మైనార్టీ బాలికల, బద్దెనపల్లి, నేరెళ్లలోని బాలికల రెసిడెన్షియల్ హాస్టళ్లలో కలెక్టర్ తనిఖీలు చేశారు. కిచెన్, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, పండ్లను పరిశీలించారు.
మండేపల్లిలోని మైనార్టీ బాలుర హాస్టల్‌లో సౌకర్యాలు సరిపడా లేకపోవడంతో వారికి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన పాత భవనాన్ని వినియోగించాలని సూచించారు. పెద్దూర్, మండేపల్లిలోని ఆర్‌వో ప్లాంట్లు రెండు రోజుల్లో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈవో వినోద్ కుమార్, డీపీఆర్వో వి.శ్రీధర్, ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఉన్నారు.