
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరింది. శనివారం రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. 5.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ సీట్లకు గాను 199 చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కరణ్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ చనిపోవడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశా రు. ఇక ఐదేండ్లకోసారి ప్రభుత్వాన్ని మారుస్తూ వస్తున్న ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మళ్లీ అధికారంలోకి వచ్చి ట్రెండ్ మార్చాలని కాంగ్రెస్, పవర్ కోసం బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేశాయి. రెడ్ డైరీ, మహిళలపై నేరాలు, అవినీతి, పేపర్ లీక్ తదితర అంశాలను బీజేపీ లేవనెత్తగా.. తమ పథకాలు, ప్రోగ్రామ్స్‌ను కాంగ్రెస్ చెప్పుకుంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఏడు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
యువత ఓట్లే కీలకం
రాజస్థాన్‌లో మొత్తం ఓటర్లు 5.25 కోట్ల మంది. వీరిలో 18–30 ఏండ్ల వయసున్న వారు 1.71 కోట్ల మంది ఉన్నారు. కేవలం 18–19 ఏండ్ల మధ్య ఉన్న వాళ్లే 22.6 లక్షల మంది ఉన్నారు. దీంతో యువత ఓటు కీలకంగా మారనుంది. కాంగ్రెస్ నుంచి సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, పార్టీ స్టేట్ చీఫ్ గోవింద్ సింగ్ డొతస్ర, స్పీకర్ సీపీ జోషి, పలువురు మంత్రులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న మాజీ సీఎస్ నిరంజన్ ఆర్య కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి మాజీ సీఎం వసుంధర రాజే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, పలువురు ఎంపీలు కూడా బరిలో నిలిచారు. 59 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆరుగురు లోక్‌సభ ఎంపీలు, ఓ రాజ్యసభ ఎంపీకి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ 97 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ చాన్స్ ఇచ్చింది.
బరిలో 40 మంది రెబల్స్
బీజేపీ అన్ని సీట్లలో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ ఒకటి వదిలిపెట్టింది. తమ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి భారత్‌పూర్ సీటును కేటాయించింది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి టికెట్లు దక్కకపోవడంతో ఆ రెండు పార్టీలకు చెందిన 40 మంది రెబల్స్ కూడా పోటీ చేస్తున్నారు. దీంతో వీళ్ల వల్ల ఓట్లు చీలితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 107 మంది, బీజేపీకి 70 మంది, ఆర్‌ఎల్‌పీకి ముగ్గురు, సీపీఎంకు ఇద్దరు, బీటీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్‌ఎల్‌డీకి ఓ ఎమ్మెల్యే ఉండగా.. 13 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. ఉదయ్‌పూర్, కరణ్‌పూర్ వేకెంట్‌గా ఉన్నాయి.
గట్టి బందోబస్తు ఏర్పాటు
ఎన్నికల కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని సీఈవో ప్రవీణ్ గుప్తా వెల్లడించా రు.‘‘రాష్ట్రవ్యాప్తంగా 36,101 ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. 26,393 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ కండక్ట్ చేస్తాం” అని చెప్పారు. ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించేందుకు సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్ఎస్బీ, ఆర్‌పీఎఫ్ తదితర సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, 18 రాష్ట్రాలకు చెందిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సహా మొత్తం 1.70 లక్షల మందిని మోహరించారు.
సీట్లు 199 (ఒక చోట వాయిదా)
అభ్యర్థులు 1,862 మంది
ఓటర్లు 5,25,38,105 మంది
పోలింగ్ కేంద్రాలు 51,507
పోలింగ్ సిబ్బంది 2,74,846 మంది
కౌంటింగ్ డిసెంబర్ 3