కేంద్ర మంత్రి నిత్యానంద, రాజస్థాన్‌ సీఎంకు కరోనా

కేంద్ర మంత్రి నిత్యానంద, రాజస్థాన్‌ సీఎంకు కరోనా

దేశంలో కరోనా వైరస్ విజృంభణ మరోసారి తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 90 వేలకు పైగా కేసులు వచ్చాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇటీవలే కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహారాష్ట్రలో 11 మంది మంత్రులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తనకు కరోనా నిర్థారణ అయిందని, తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఆయన బుధవారం సెంట్రల్ ఆర్మ్డ్‌ ఫోర్సెస్‌కు ఆయుష్మాన్ హెల్త్ కార్డులను అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్‌ఎస్‌బీ చీఫ్‌లు హాజరయ్యారు.

రాజస్థాన్ సీఎం, ఆదిలాబాద్ ఎంపీలకు కరోనా

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తాను కరోనా బారినపడినట్లు గురువారం ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేశారు. ఈ రోజు సాయంత్రమే తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని చెప్పారు. తనను కలిసిన వాళ్లు ఐసోలేషన్‌లోకి వెళ్లాలని, కొవిడ్ టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన కొన్ని గంటల ముందే ప్రెస్‌ మీట్‌లో మాట్లాడారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రద్దు చేయాల్సిన అవసరం లేదని, ప్రచార సభలను రద్దు చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయనతో పాటు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ కూడా పాల్గొన్నారు.

మంచు లక్ష్మి, మిమి చక్రవర్తి..

కాగా, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, సినీ నటి మంచు లక్ష్మి, టీఎంసీ ఎంపీ, బెంగాలీ నటి మిమి చక్రవర్తికి కూడా కరోనా సోకింది. వారు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఎంపీ సోయం బాపూరావు కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. తనను కలిసిన వారంతా ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.