వచ్చే సీజన్ నాటికి 1.50లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వచ్చే సీజన్ నాటికి 1.50లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు  : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వచ్చే సీజన్​ నాటికి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని  పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని 1.50లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్లాన్​ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  కలెక్టరేట్​లో శనివారం పలు శాఖల అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. భూ సేకరణ స్పీడ్​గా చేసే విధంగా ఆఫీసర్లు ప్లాన్​ చేసుకోవాలన్నారు. 

జూలూరుపాడు టన్నెల్​ దాటితే లలితపురం నుంచి ఇల్లెందు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మరో వైపు దేవాదుల నుంచి బయ్యారం మీదుగా ఇల్లెందుకు నీళ్లు ఇచ్చేలా ప్లాన్​ చేస్తున్నామన్నారు. రెండింటిలో ఏది ఖర్చు తక్కువతో కూడుకున్నదో అనే విషయమై సర్వే చేయించనున్నట్టు పేర్కొన్నారు. 

పంట ఎండకుండా చర్యలు 

ఖమ్మం జిల్లాలో సాగర్​ ఆయకట్టు కింద ఎండి పోతున్న పంట పొలాలను ఆదుకునేందుకు సీతారామ ప్రాజెక్ట్​ ద్వారా నీళ్లు ఇస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లాలో సాగర్​ ఆయకట్టు కింద పంటలకు కృష్ణా నీళ్లు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయమై ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డితో ఫోన్​లో మాట్లాడి, ఆయన సూచనల మేరకు సీతారామ ప్రాజెక్ట్​ ద్వారా మోటార్లను ఆన్​ చేశామన్నారు. కాగా, ఎన్​పీడీసీఎల్, ఇరిగేషన్​ ఉన్నతాధికారుల తీరుపై కొంత అసహనం వ్యక్తం చేశారు. 

వరదలపై రివ్యూ... 

గోదావరికి వరద పోటెత్తుతున్న క్రమంలో ఆఫీసర్లంతా అలర్ట్​గా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇరిగేషన్​, ఆర్​అండ్​బీ, అగ్రికల్చర్, విద్యుత్​, హెల్త్​, రెవెన్యూ, పొలీస్​, ఫైర్​, పంచాయతీ శాఖల అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. చర్ల రోడ్డుపై వరద పోటెత్తితే నియోజకవర్గంలోని పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని, వర్షాలకు ముందే ఈ రహదారిలోని బ్రిడ్జీ పనులు చేపట్టకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. 

అక్టోబర్​ నుంచి జూన్​లో పు పనులు పూర్తి చేసేలా  ఆర్​ అండ్​ బీ అధికారులు ప్లాన్​ చేసుకోవాలన్నారు. ఆయిల్​ పామ్​ రైతులకు అవసరమైన విధంగా విద్యుత్​ సప్లై చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​, గిడ్డంగుల సంస్థ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్​ జితేశ్​ వీ​ పాటిల్ ,​ ఎస్పీ బి. రోహిత్​ రాజు, స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, సీతారామ ప్రాజెక్ట్​ ఎస్​ఈ శ్రీనివాస్​ రెడ్డి, ఎన్​పీడీసీఎస్​ ఎస్​ఈ మహేందర్​తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.