గుండు కొట్టించుకున్న ఎమ్మెల్యే.. మొక్కు కాదు.. నిరసన అంట

గుండు కొట్టించుకున్న ఎమ్మెల్యే.. మొక్కు కాదు.. నిరసన అంట

అందరూ ఒక పార్టీ ఎమ్మెల్యేలే. కానీ వారిలో వారికి పడదు. ఇలాంటి రాజకీయాలు అన్ని రాష్ట్రాలలో సాధారణమే అయినప్పటికీ.. తన మాటలు ముఖ్యమంత్రి పట్టించుకోలేదని గుండు కొట్టించుకోవడం మాత్రం వింతే. ఈ ఘటన రాజస్థాన్ రాజకీయాలలో చోటుచేసుకుంది. గనుల శాఖ మంత్రి ప్రమోద్ జైన్ భయా అవినీతిపై సీఎం అశోక్ గెహ్లాట్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే భరత్ సింగ్ గుండు కొట్టించుకున్నారు.

సంగోడ్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్.. చాలా కాలంగా ప్రమోద్ జైన్ అవినీతిపై సీఎంకు లేఖలు రాస్తూనే ఉన్నారు. అయినప్పటికీ గెహ్లాట్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక లాభం లేదనుకున్న భరత్ సింగ్.. గెహ్లాట్‌కు వ్యతిరేకంగా వినూత్నంగా గుండు కొట్టించుకొని నిరసన చేపట్టారు. ఆయన రాసిన లేఖ, గుండు గీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

గెహ్లాట్‌కు లేఖ రాసిన భరత్ సింగ్ 

భరత్ సింగ్.. గెహ్లాట్‌కు రాసిన లేఖలో 'మీరు భయా అవినీతికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. గాంధేయవాది అయిన గెహ్లాట్‌కు ఇది సరికాదు. మీలోని చిత్తశుద్ధి చచ్చిపోయింది. దీని కోసం నేను నా తల క్షౌరము చేసి నా జుట్టును నీకు సమర్పిస్తున్నాను. దయచేసి ఈ వినయపూర్వకమైన బహుమతిని అంగీకరించండి. ఈ ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు.." అని రాసుకొచ్చారు.

కాగా, అశోక్ గెహ్లాట్ మంగళవారం చంబల్ రివర్ ఫ్రంట్‌ను ప్రారంభించేందుకు కోటాను సందర్శించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.